Oct 28,2021 18:50

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సూర్యకుమారి

ప్రజాశక్తి-విజయనగరం : అర్హులందరికీ ఇళ్ల నిర్మాణ పథకంలో భాగంగా గృహ నిర్మాణాలకు ముందుకు రాని వారికి అవగాహన కలిగించాలని కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి మున్సిపల్‌ కమీషనర్లను, గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. ఎక్కడ ఇల్లు కడితే అక్కడికి వెళ్లేలా ముందుగా లబ్దిదారులను చైతన్య పరచాలని తెలిపారు. ఆసక్తి లేని వారి పట్టాలను రద్దు చేసి ఆసక్తి ఉన్న అర్హులైన వారికి ఇవ్వాలని సూచించారు. ఇష్టం ఉన్న వారితో ముందు నిర్మాణాలు చేపడితే, మిగిలిన వారిలో చైతన్యం కలిగి వారు కూడా ముందుకు వస్తారని అన్నారు. జగనన్న కాలనీలు, వన్‌ టైం సెటిల్‌ మెంట్‌, టిడ్కో గృహాల పురోగతిపై గురువారం కలెక్టరేట్‌లో జెసి అశోక్‌ మయూర్‌తో కలిసి కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న కాలనీ లలో రహదారులు, విద్యుత్‌, నీటి సరఫరా, బోర్‌వెల్స్‌ తదితర మౌలిక వసతులను త్వరగా కల్పించాలని, అన్ని వసతులు ఉంటే ప్రజలకు ఆసక్తి కలుగుతుందని అన్నారు. వచ్చే శుక్రవారాని కల్లా జియో ట్యాగింగ్‌ , క్లస్టర్‌ మాపింగ్‌ , రిజిస్ట్రేషన్‌ లు పూర్తి కావాలని సూచించారు. ఒటిఎస్‌ పథకంపై దష్టి పెట్టి లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలన్నారు.
డిసెంబర్‌ లో టిడ్కో గృహాల అందజేత
ఈ డిసెంబర్‌ నెలలో టిడ్కో గృహాలను లబ్దిదారులకు అందజేయాలని ప్రభుత్వం భావిస్తున్నందున నవంబర్‌ 25 నాటికే గృహాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. మొదటి దశలో అందజేసే గృహాలకు సంబంధించిన అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. సమావేశంలో హౌసింగ్‌ పీడీ పి.కూర్మి నాయుడు, కార్పొరేషన్‌ కమిషనర్‌ వర్మ, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, నెల్లిమర్ల మున్సిపల్‌ కమిషనర్లు , హౌసింగ్‌ ఇఇ , డిఇలు పాల్గొన్నారు.