Dec 08,2022 22:20

-మతం పేరుతో జనాల మధ్య విభజన కుట్ర
-ధనికుల కొమ్మూకాస్తూ పేదలపై దాడి
-వ్యవసాయ కార్మిక సంఘం 29వ రాష్ట్ర మహాసభ బహిరంగ సభలో బృందాకరత్‌
ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి:
గత బడ్జెట్‌లో పేదలకు సంబంధించిన ఉపాధి హామీ చట్టానికి కేటాయించిన నిధుల్లో 25 శాతం కోత విధించి మోడీ సర్కార్‌ కష్టజీవుల పొట్టకొట్టిందని, అదే సమయంలో ధనవంతులకు లక్షల కోట్లు రాయితీల రూపంలో కట్టబెడుతోందని గిరిజనోద్యమ జాతీయ నేత బృందాకరత్‌ అన్నారు. మూడు రోజులపాటు జరగనున్న ఎపి వ్యవసాయ కార్మిక సంఘం 29వ రాష్ట్ర మహాసభ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో గురువారం ప్రారంభమైంది. దీనిలో భాగంగా తొలుత మార్కెట్‌ యార్డు నుంచి బస్టాండ్‌ వరకూ భారీ ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్‌ సమీపంలోని కుంజా బజ్జి, సున్నం రాజయ్య స్మారక ప్రాంగణంలో నిర్వహించిన బహిరంగ సభకు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి బృందాకరత్‌ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కళ్లద్దాలకు ధనికులు మాత్రమే కన్పిస్తున్నారని, పేదలు కన్పించడం లేదని విమర్శించారు. అదానీ రోజుకు పది వేల కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే, పేదలు నెలంతా కష్టపడినా పది వేల రూపాయలు కూడా రావడం లేదని, మోడీ దుర్మార్గపు పాలనకు ఇది నిదర్శనమని తెలిపారు. 75 ఏళ్లుగా పాలిస్తున్న ప్రభుత్వాలు వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం లేదన్నారు. 75 ఏళ్ల స్వాతంత్రంలో ఆహార భద్రతలో సంపూర్ణత సాధించామంటే వ్యవసాయ కార్మికుల శ్రమ ఫలితమేనని తెలిపారు. ఏయేటికాయేడు ఉపాధి పనులు తగ్గిపోతున్నాయని అన్నారు. ఏడాదికి 50 రోజులు కూడా పని కల్పించడం లేదని, ఈ ఏడాది 43 రోజు కూడా పని కల్పించలేదని తెలిపారు. పెట్టుబడిదారుల కోసం మోడీ ప్రభుత్వం గిరిజన చట్టాలను మార్చేస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో గిరిజనులను తరిమేస్తున్నారని తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్వహించిన పోరాటాలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయన్నారు. రాష్ట్రంలో వందలాది గ్రామాల్లో భూముల కోసం పోరాటాలు సాగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా 12,300 మంది వ్యవసాయ కార్మికులపై జగన్‌ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని, 125 మందిని జైలుకు పంపిందని అన్నారు. 'ఈ వేదిక నుంచి జగన్‌ ప్రభుత్వానికి ఒకటే చెబుతున్నాం. నీవేం చేసుకుంటావో చేసుకో. ఈ పోరాటాలు ఆగవు' అని పేర్కొన్నారు. నవరత్నాల గురించి తెలుసని, ముఖ్యమైన రత్నమైన భూమిని పంచాలని, కూలి పెంచాలని అన్నారు. ఎపిలో ఉపాధి వేతనం రోజుకు కనీస వేతనం రూ.257 మాత్రమే ఇస్తున్నారని, ఎపి వెబ్‌సైట్‌ చూస్తే అది కూడా అమలు చేయడం లేదని, రూ.228 ఇస్తున్నట్లు తెలుస్తోందని తెలిపారు. కనీస వేతనం ఇవ్వకపోగా పనిభారం పెంచుతున్నారన్నారు. సుదీర్ఘ పోరాటాల ఫలితంగా 2006లో అటవీ హక్కుల సంరక్షణ చట్టం సాధించామన్నారు. లక్షా 57 వేల పట్టాలు సాధించగా ఇప్పుడు మళ్లీ ఆ భూములను లాగేసుకుంటున్న పరిస్థితి ఉందని తెలిపారు. కేరళలో ఎర్రజెండా ప్రభుత్వం నిత్యావసరాలను సరసమైన ధరలకు పేదలకు అందిస్తోందని, రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ఎందుకు అందించడం లేదో చెప్పాలని అన్నారు. అనంతరం జంగారెడ్డిగూడెం ప్రాంత ముస్లిం నేతలు, ముస్లిం మహిళలు దుశ్శాలువాతో బృందాకరత్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్ద ముస్తఫా మాట్లాడుతూ దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చాక ముస్లిం, క్రిస్టియన్లను బతకనివ్వడం లేదని, ఎర్ర జెండా తమను కాపాడుతోందని తెలిపారు.
చంద్రబాబు, జగన్‌ పేదల భూములు గురించి మాట్లాడరు : విజయ రాఘవన్‌
చంద్రబాబు అమరావతి అని, జగన్‌ మూడు రాజధానులు అని అనడం తప్ప, పేదల భూముల గురించి వీరిద్దరూ మాట్లాడరని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షులు విజయరాఘవన్‌ విమర్శించారు. కేరళలో 96 శాతం ప్రజలకు ఇళ్లు, భూములున్నాయని, ఎపిలో మాత్రం ఆ పరిస్థితి లేదని అన్నారు. దేశంలో 60 శాతం జనాభాకు భూమి లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి భూమిచ్చేందుకు సహకరించడం లేదని తెలిపారు. కరోనా సమయంలో కేరళలో పేదలకు నిత్యావసరాలు ఇచ్చి ఆదుకోగా, ఎపిలో అటువంటి సహకారం లేదని అన్నారు. రైతులు, కార్మికులు అంతా కలిసి పోరాడితేనే సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు.
బిజెపి పాలన కొనసాగితే మత, ప్రాంతీయ యుద్దాలే : బి.వెంకట్‌
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మైనార్టీల, గిరిజనుల, దళితుల వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ దేశప్రజలపై హిందూత్వం రుద్దేందుకు ప్రయత్నిస్తోందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ విమర్శించారు. ఈ పాలన కొనసాగితే రానున్న కాలంలో మత, ప్రాంతీయ యుద్ధాలు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ఆదేశిస్తే జగన్‌ చేస్తున్నారని, కృష్ణపట్నం పోర్టు దగ్గర నుంచి అన్నీ అదానికి కట్టబెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 250 కేంద్రాల్లో భూపోరాటాలు సాగుతున్నాయన్నారు. ఆదివాసీల 1/70 చట్టానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ సభలో కేరళ వ్యవసాయ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్‌ చంద్రన్‌, పిడిఎఫ్‌ ఎంఎల్‌సిలు ఇళ్ల వెంకటేశ్వరరావు, షేక్‌ సాబ్జీ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, పూర్వపు రాష్ట్ర కార్యదర్శి మంతెన సీతారాం, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ఎ.రవి, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, గిరిజన సంఘం, సిఐటియు నాయకులు పాల్గన్నారు.