
కలెక్టరేట్: జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఈనెల 25న నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ కె.హేమలత తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహణ ఏర్పాట్లపై ఆర్‌డిఒ కార్యాలయంలో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 25న మధ్యాహ్నం 2 గంటలకు ఆర్సిఎం (జిల్లా కార్యాలయాల సమూహం) కాంప్లెక్స్‌లో కార్యక్రమం జరగనుందని చెప్పారు. జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఆమె తెలిపారు. ఓటర్ల దినోత్సవంను వేడుకగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. కళాశాల విద్యార్థుల బృందాలకు ఓటరు దినోత్సం భావనపై రంగోలి పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రంగోలిలో పాల్గొనే విద్యార్థి బృందాలు ఓటరు నమోదు, ఓటు హక్కు వినియోగం, ఓటింగ్‌లో ఇవిఎం పాత్ర, పోలింగ్ బూత్ తదితర ఎన్నికల ప్రక్రియలకు సంబంధించిన అంశాలపై ముగ్గులు వేయాలని ఆమె సూచించారు. వేదిక వద్ద సెల్ఫి పాయింట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఓటరు ప్రతిజ్ఞ, ఉత్తమ బూత్ స్థాయి అధికారులకు ప్రశంసా పత్రాలు పంపిణీ, యువ ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ, సీనియర్ ఓటర్లకు సన్మాన కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. సమావేశంలో డిపిఆర్‌ఒ ఎల్.రమేష్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎ.రాజు, తహశీల్దార్ శివన్నారాయణ, ఇతర సహాయ ఓటరు నమోదు అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.