
- రాజ్యాంగాన్ని, లౌకిక వ్యవస్థను కాపాకుందాం
- బిజెపి, మతోన్మాదుల ఆగడాలను అడ్డుకుందాం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, మతోన్మాదులు విద్వేషపూరిత ప్రచారాలను చేస్తూ ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నారని లౌకక రాజ్యాంగ పరిరక్షణ వేదిక తెలిపింది. శనివారం విజయవాడ ఎంబివికెలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరిరక్షణ కమిటీ చైర్మన్ జల్లి విల్సన్, కన్వీనర్లు ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, మౌలానా ముస్తాక్ అహ్మద్ మాట్లాడారు. బిజెపి, మతోన్మాదుల కుట్రలను ప్రజలకు వివరించి, భారత రాజ్యాంగాన్ని, లౌకిక వ్యవస్థను కాపాడుకునే పోరాటంలో ప్రతిఒక్కరినీ భాగస్వాములను చేసేందుకు ఈ నెల 26న రిపబ్లిక్ దినోత్సవం నుంచి మహాత్మా గాంధీ వర్థంతి 30వ తేదీ వరకు లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యాన 13 జిల్లాల్లో సదస్సులు, రౌండ్‌టేబుల్ సమావేశాలు, సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక బాధ్యులు రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజలను సమీకరించి సదస్సులు, సమావేశాలు, సభలు ఏర్పాటు చేసి లౌకిక వ్యవస్థను, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయనున్నారని చెప్పారు. రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందని, ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు, నిరుద్యోగం పెరిగి ప్రజల్లో తిరుగుబాటు వస్తోందని, దాని నుంచి దృష్టి మళ్లించి రాష్ట్రంలో బలపడేందుకు గుంటూరులో జిన్నా టవర్, విశాఖపట్నంలో కెజిహెచ్ ఆస్పత్రి పేర్లు మార్చాలని, ఆత్మకూరులో మసీదు విషయంలో గొడవలు సృష్టించారని విమర్శించారు. బిజెపి చేస్తున్న డిమాండ్ల వల్ల రాష్ట్రాభివృద్ధికి, ప్రజలకు ఎటువంటి ఉపయోగమూ ఉండదని, తమ స్వార్థం కోసమే ఈ అంశాలను తెరపైకి తెచ్చి ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలుగు ప్రజలు తెలివిగలవారని, మతోన్మాదుల ఉచ్చులో చిక్కుకోరని, తగిన సమయంలో సరైన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. త్వరలో ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో మతోన్మాదుల ఆగడాలు మరింత పెరిగిపోయాయని, ఇటీవల హరిద్వార్‌లో ధర్మ సంసద్ సభ నిర్వహించి మైనారిటీలను ఊచకోత కోయాలని ప్రకటించినా ప్రధాన మంత్రి, ఇతర మంత్రులు ఖండించలేదన్నారు. ఇటువంటి వారి ఆగడాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ సమావేశంలో ఆవాజ్ రాష్ట్ర కన్వీనర్ ఎంఎ చిస్తీ, డిహెచ్పిఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బుట్టి రాయప్ప, ఇన్సాఫ్ రాష్ట్ర కన్వీనర్ సయ్యద్ అఫ్సర్, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు జి.నటరాజు, న్యాయవాది మతీన్, మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్, ఎస్కె రఫి, ఎస్కె సుభానీ, రబ్బానీ, ఇర్షాద్ పాల్గొన్నారు.