Jan 28,2021 20:56

కొనుగోలు కేంద్ర నిర్వాహకులతో మాట్లాడుతున్న జెసి

రామభద్రపురం : జిల్లాలో సుమారు 5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు నిర్ణయించగా, ఇప్పటికి 3.45 లక్షల టన్నులు సేకరించామని జాయింట్‌ కలెక్టర్‌ జి.సి.కిశోర్‌కుమార్‌ తెలిపారు. రైతులకు రూ.152 కోట్లు చెల్లింపులు చేశామని, ఇంకా రూ.180 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. రామభద్రపురం పిఎసిఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం జెసి తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన స్థానిక తహశీల్దార్‌ పి.గణపతిరావుతో మాట్లాడి, ఇంతవరకు ఎన్ని క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు, రైతులకు ఎంత బిల్లులు చెల్లించారు? అనే విషయాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇ-క్రాప్‌ ద్వారా రైతులు తమ పంటలను అమ్ముకోవడానికి రిజిస్ట్రేషన్‌ చేసుకొనే సదుపాయం కల్పించినట్లు చెప్పారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల పంట చేతికొచ్చేసరికి ఆలస్యమైందని, ఇ-క్రాప్‌ రిజిస్ట్రేషన్‌కు మరొక అవకాశమిచ్చామని వెల్లడించారు. ఇక్కడి కొనుగోలు కేంద్రం ద్వారా 630 మంది రైతుల వద్ద నుంచి సుమారు 41 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ పి.గణపతిరావు, పిఎసిఎస్‌ చైర్మన్‌ కిర్ల శేఖర్‌, ఆర్‌ఐ పాల్గొన్నారు.