
న్యూఢిల్లీ : భారత్‌లో పెట్టుబడులు, కార్యకలాపాలకు అనేక విదేశీ కంపెనీలు అనాసక్తి చూపుతున్నాయని ప్రభుత్వ గణంకాలు చెబుతున్నాయి. గడిచిన ఆరేళ్లలో వేలాది విదేశీ కంపెనీలు మూత పడ్డాయి. 2017 నుంచి 2022 మధ్య భారతదేశంలో మొత్తం 3,552 విదేశీ కంపెనీలు, విదేశీ కంపెనీల అనుబంధ సంస్థలు మూసివేయబడ్డాయని మంగళవారం రాజ్యసభకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాతపూర్వకంగా తెలిపింది. ప్రతీ కంపెనీ తన కార్యకలాపాలను మూసివేయాలనేది ఆ యాజమాన్య ప్రత్యేక నిర్ణయమని పేర్కొంది. ఇక్కడి తన బ్రాంచ్ ఆఫీసు ఆపరేషన్ నిలిపివేయడం వంటి అంశాలు ఉండవచ్చని తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంజూరు చేసిన అనుమతి లేదా లైసెన్స్ మొదలైన వాటి చెల్లుబాటు గడువు ముగియడం, మాతృ సంస్థ యొక్క వ్యాపార విధానం మార్పు కారణంగా దాని కార్యకలాపాలను ప్రారంభించకపోవడం, కంపెనీని మూసివేయడం, ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత తన కార్యాలయాలను రద్దు చేసుకోవడం తదితర ప్రక్రియలు విదేశీ కంపెనీల అనుబంధ సంస్థలను మూసివేయడానికి ప్రధాన కారణాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 14,137 క్రియాశీల విదేశీ అనుబంధ సంస్థలు పని చేస్తున్నాయని వెల్లడించింది.