May 31,2023 15:12

న్యూఢిల్లీ  :  దేశవ్యాప్తంగా రెండు నెలల్లో సుమారు 40 మెడికల్‌ కాలేజీలు గుర్తింపును కోల్పోయాయి. జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసి) ప్రమాణాలను పాటించకపోవడంతో ఆయా కాలేజీల గుర్తింపును రద్దు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తమిళనాడు, గుజరాత్‌, అస్సాం, పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌, పుదుచ్చేరి సహా పశ్చిమబెంగాల్‌లోని సుమారు 100కి పైగా మెడికల్‌ కాలేజీలు కూడా ఇదే తరహా చర్యలు ఎదుర్కోనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. సిసిటివి కెమెరాలు లేకపోవడం, ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ హాజరు ప్రక్రియను చేపట్టకపోవడం, సరైన అధ్యాపక బృందం లేకపోవడం వంటి పలు నిబంధనలను ఉల్లంఘించినట్లు కమిషన్‌ చేపట్టిన సర్వేలో తేలిందని పేర్కొన్నాయి. లోటుపాట్లను గుర్తించిన ఎన్‌ఎంసి మెడికల్‌ కాలేజీల గుర్తింపును రద్దు చేస్తోందని, కానీ అదే సమయంలో ఆయా కాలేజీల్లో విద్యార్థులకు నమోదుకు అనుమతిస్తోందని కమిటీకి చెందిన ఓ నిపుణుడు పేర్కొన్నారు. ఈ చర్య సరికాదని, దీంతో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్టను దిగజారుస్తుందని అన్నారు. భారత్‌ నుండి అత్యధికంగా వైద్యులు విదేశాలకు వెళుతున్నారని, ఇటువంటి ఉదంతాలు వెలుగులోకి రావడంతో ప్రపంచం భారతీయ విద్యార్థులపై విశ్వాసాన్ని కోల్పోతుందని అన్నారు.

2014 నుండి వైద్య కాలేజీల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మెడికల్‌ కాలేజీల్లో 69 శాతం పెరుగుదల నమోదు కాగా, 2014లో 387గా ఉన్న వాటి సంఖ్య ప్రస్తుతం 654కి చేరిందని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి పర్వీన్‌ పవార్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజ్యసభలో పేర్కొన్నారు. అలాగే ఎంబిబిఎస్‌ సీట్లలో 94 శాతం పెరుగుదల ఉందని, దీంతో 2014లో 51,348 గా ఉన్న వాటి సంఖ్య ప్రస్తుతం 99,763కి చేరిందని అన్నారు. అలాగే పిజి సీట్లలో 107 శాతం పెరుగుదల ఉందని నమోదైందని, 2014లో 31,185 సీట్లు ఉండగా ప్రస్తుతం 64,559 సీట్లు ఉన్నట్లు తెలిపారు. దేశంలో వైద్యుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం మెడికల్‌ కాలేజీలకు సమానంగా ఎంబిబిఎస్‌ సీట్లను కూడా పెంచినట్లు ఆమె పేర్కొన్నారు.