Jul 29,2021 21:26

మహిళల 4×200మీ. రిలే ఈవెంట్‌లో చైనా అమ్మాయిలు సంచలనం సృష్టించారు. ఈ ఈవెంట్‌ హాట్‌ ఫేవరెట్స్‌ అయిన అమెరికా, ఆస్ట్రేలియాలను వెనక్కి నెట్టడమే కాదు.. ఏకంగా ప్రపంచ, ఒలింపిక్‌ రికార్డులను నమోదు చేస్తూ బంగారు పతకాన్ని ఎగరేసుకుపోయారు. చైనాకు చెందిన యాంగ్‌ జున్‌జువాన్‌, ఝాంగ్‌ యుఫెయి, లి బింగ్జీ, తాంగ్‌ ముహాన్‌ టీమ్‌.. 7 నిమిషాల 40.33 సెకన్లలో ఈ రిలేను పూర్తి చేయడం విశేషం. అమెరికా (7:40.73), ఆస్ట్రేలియా (7:41.29) రజిత, కాంస్య పతకాలను సాధించాయి. 1996లో తొలిసారి ఒలింపిక్స్‌లోకి ఈ ఈవెంటన్‌ను ప్రవేశపెట్టిన తర్వాత అమెరికా, ఆస్ట్రేలియా కాకుండా మరో జట్టు స్వర్ణం గెలవడం ఇదే తొలిసారి. మూడు జట్లు గత ప్రపంచ రికార్డ్‌ను (7:41.50) అధిగమించడం విశేషం. చివరి లెగ్‌లో అమెరికా స్టార్‌ స్విమ్మర్‌ కేటీ లెడెక్కీ జట్టును ముందుకు నడిపించేలా కనిపించినా.. చివరికి చైనానే బంగారు పతకాన్ని సాధించడం విశేషం. అంతకుముందు జరిగిన మహిళల 200మీ. బటర్‌ఫ్లై పోటీలో జంగ్‌(చైనా) స్వర్ణ పతకాన్ని గెలిచింది.