Jul 02,2022 06:49

ముంబయి : మహారాష్ట్రలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వం ఈ నెల 4న బలపరీక్ష ఎదుర్కోనుంది. ఈ విషయాన్ని విధాన్‌ భవన్‌లోని ఒక సీనియర్‌ అధికారి శుక్రవారం వెల్లడించారు. ఇందుకోసం ఈ నెల 3, 4 తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. బిజెపి ఎమ్మెల్యే రాహుల్‌ నర్వేకర్‌ అసెంబ్లీ స్పీకర్‌ పదవి కోసం శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఒక వేళ ఈ పదవికి ఎన్నిక అవసరమైతే, ఈ నెల 3న ఎన్నిక నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. స్పీకర్‌ పదవికి కాంగ్రెస్‌కు చెందిన నానా పటోల్‌ గత ఏడాది ఫిబ్రవరిలో రాజీనామా చేశారు. అప్పటి నుంచి మహారాష్ట్ర స్పీకర్‌ పదవీ ఖాళీగానే ఉంది.
11న శివసేన పిటిషన్‌ విచారణ
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, 15 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి నిషేధం విధించాలని కోరుతూ శివసేన దాఖలు చేసిన పిటీషన్‌ను ఈ నెల 11న సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ 16 మంది అనర్హత అంశం పెండింగ్‌లో ఉన్న కారణంగా, ఆ విషయం నిర్థారణ అయ్యే వరకూ అసెంబ్లీ నుంచి నిషేధం విధించాలని శివసేన పిటిషన్‌ వేసింది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జెబి పార్ధివాలాలతో కూడిన ధర్మాసనాన్ని శివసేన తరుపున సీనియర్‌ లాయర్‌ కపిల్‌ సిబాల్‌ అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను 11న విచారించడానికి ధర్మాసనం అంగీకరించింది.
ఆరే కాలనీలోనే మెట్రో కార్‌ షెడ్‌ ప్రాజెక్టు
మెట్రో కార్‌ షెడ్‌ ప్రాజెక్టును కంజుర్‌మార్గ్‌ నుంచి మళ్లీ ఆరే మిల్క్‌ కాలనీకి తరలించాలని మహారాష్ట్రలోని నూతన ప్రభుత్వం తొలి నిర్ణయం తీసుకుంది. గురువారం రాత్రి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ సమావేశం నిర్వహించారు. మెట్రో కార్‌ షెడ్‌ ప్రాజెక్టును కంజుర్‌మార్గ్‌ నుంచి ఆరే కాలనీకి మహారాష్ట్ర ప్రభుత్వం తరలించ నుందని, బాంబే హైకోర్టులో శుక్రవారం నివేదిక సమర్పించాలని రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ను ఏక్‌నాథ్‌, ఫడ్నవిస్‌ ఆదేశించారు. 2019 అక్టోబర్‌ 4న అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ ప్రభుత్వం ముంబయి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎంఎంఆర్‌సిఎల్‌) ముంబయి మెట్రో లైన్‌ 3 కోసం కార్‌షెడ్‌ ప్రాజెక్టును ఆరే మిల్క్‌ కాలనీలో నిర్మించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు మూడు వేల చెట్లను కొట్టివేయాల్సి ఉంటడంతో ముంబయి వాసుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పలు ఆందోళనలు జరిగాయి.