Nov 25,2021 10:18

తిరువనంతపురం : కేరళ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలను అందించేందుకు 50 ప్రభుత్వ ఆసుపత్రుల్లో డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ ప్రాజెక్టును ఆన్‌లైన్‌లో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రారంభించారు. ఈ నూతన ఈ-ఆరోగ్య పథకం కింద.. ప్రజలకు సంబంధిత వివరాలను రాష్ట్రంలోని డేటా సెంటర్‌లో భద్రపరుస్తామని, ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనేనా చికిత్స పొందేందుకు రోగులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య లేదా కార్డును జారీ చేస్తామని తెలిపారు. ప్రతి పౌరునికి ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్డు ఉండటమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ద్వారా ప్రతి పౌరుని ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్డుకు అందుబాటులో ఉంటుందన్నారు. టెలిమెడిసన్‌, ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్‌ వంటి బుకింగ్‌ సదుపాయాలు డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ ప్రాజెక్టులో భాగాలని తెలిపారు.
ఈ కొత్త విధానం వల్ల డాక్టర్ల అపాయింట్‌మెంట్‌ త్వరగా దొరుకుతుందని, ఇన్‌-అవుట్‌ పేషంట్‌ రోగుల రద్దీని తగ్గిస్తోందని రిఫరల్స్‌, ఆన్‌లైన్‌ సంప్రదింపుల కోసం టెలిమెడిసన్‌ వంటి సౌకర్యాలు సులభతరమౌతాయని అన్నారు. అంతేకాకుండా, ఇన్‌ఫెక్షన్‌, ఇతర వ్యాధులతో పాటు తల్లి-శిశు సంరక్షణ సమస్యలను కూడా ఈ-హెల్త్‌ కింద పరిష్కారమౌతాయని విజయన్‌ తెలిపారు. ఈ కొత్త విధానంలో భాగంగా కేరళలోని ఆరోగ్య కార్యకర్తలు.. ప్రతి ఇంటికీ వచ్చి వివరాలు సేకరిస్తారని చెప్పారు. దీని ద్వారా ఇన్‌ఫెక్షన్‌, ఇతర వ్యాధులకు సంబంధించిన బ్లూప్రింట్‌ను పొందుతామని పేర్కొన్నారు. ఈ పథకం కింద డయాబెటిక్‌ రెటినోపతి, బ్లడ్‌ బ్యాంక్‌ ట్రేస్‌బిలిటీ, వ్యాక్సిన్‌ కవరేజ్‌ సహా వివిధ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక ప్రాజెక్టులను కేరళ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ స్ట్రాటజీ కౌన్సిల్‌ (కె-డిఐఎస్‌సి) ప్రారంభిస్తుందని విజయన్‌ తెలిపారు.