Apr 20,2021 21:39

మంత్రి వెలంపల్లి ఆదేశం
ప్రజాశక్తి - విజయవాడ అర్బన్‌ :
జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్లను కోవిడ్‌ బాధితులకు అందుబాటులో తీసుకురావాలని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కోవిడ్‌ కేసులపై మంగళవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జిల్లాస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోవిడ్‌ బాధితులను ఆస్పత్రిలో చేర్పింపి, కరోనా పరీక్షల నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇచ్చి మోనటరింగ్‌ కమిటీ ద్వారా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆరోగ్య శ్రీ కింద కోవిడ్‌ చికిత్సలు చేయాలన్నారు. మరిన్ని బెడ్లను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కలెక్టర్‌ ఏ.యండి.ఇంతియాజ్‌ మాట్లాడుతూ 104కు ఫోన్‌ చేస్తే కోవిడ్‌కు సంబంధించిన అన్ని సేవలను, సూచనలను ఇస్తామన్నారు. త్వరలోనే 3వ వ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి వస్తుందని, జిల్లాలో నిర్దేశించుకున్న ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌లో 94 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేశామని తెలిపారు. ఈ సమావేశంలో బ్రాహ్మణ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ మల్లాది విష్ణు, జెసి (రెవెన్యూ) కె.మాధవీలత, జెసి (అభివద్ధి) యల్‌.శివశంకర్‌, విఎంసి కమిషనర్‌ వి.ప్రసన్న వెంకటేష్‌, డిసిపి హర్షవర్ధన్‌రాజు, వైద్య ఆరోగ్య శాఖాధికారులు ఎం.సుహాసిని, శివప్రసాద్‌, జ్యోతిర్మణి, జి.గీతాభాయి, నవీన్‌, బాలసుబ్రహ్మణ్యం, పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాల ప్రతినిధులు పాల్గొన్నారు.