Jul 29,2021 20:13

చెక్కు అందజేస్తున్న డిప్యూటీ సిఎం పుష్పశ్రీవాణి, ఎమ్మెల్యేలు కోలగట్ల, శంబంగి

ప్రజాశక్తి-విజయనగరం  : విద్యాదీవెన పథకం కింద జిల్లాలో 57,545 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.30.02 కోట్లు జమ అయ్యింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహనరెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి గురువారం విద్యాదీవెన రెండో విడత నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, ఇన్‌ఛార్జి కలెక్టర్‌ డాక్టర్‌ జి.సి.కిశోర్‌ కుమార్‌, ఎంఎల్‌ఏలు శంబంగి వెంకట చినప్పలనాయుడు, బడ్డుకొండ అప్పలనాయుడు, కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం మేయర్‌ వెంపడాపు విజయలక్ష్మి, జాయింట్‌ కలెక్టర్‌ (సంక్షేమం) జె.వెంకటరావు, సాంఘిక సంక్షేమశాఖ డిడి కె.సునీల్‌ రాజ్‌కుమార్‌, డిబిసిడబ్ల్యూఓ కీర్తి, మైనారిటీ సంక్షేమాధికారి బి.అరుణకుమారి, కార్పొరేటర్‌ కోలగట్ల శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాదీవెన మొత్తానికి సంబంధించిన చెక్కును, విద్యార్థుల తల్లితండ్రులకు, ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి లాంఛనంగా అందజేశారు.
జిల్లాలో 57,545 మందికి లబ్ది
విద్యాదీవెన పథకం ద్వారా జిల్లాలో సుమారు 57,545 మందికి లబ్ది చేకూరుతోందని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ డాక్టర్‌ జిసి కిశోర్‌ కుమార్‌ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడుతూ, విద్యాదీవెన పథకం కింద జిల్లాకు రూ.30.02 కోట్లు విడుదలవుతుందని చెప్పారు. ఈ పథకం ద్వారా సాంఘిక సంక్షేమశాఖ విద్యార్థులు 5,419 మంది, గిరిజన సంక్షేమశాఖ ద్వారా 3,708 మంది, బిసి సంక్షేమశాఖ ద్వారా 44,220 మంది, ఇబిసిలు 3,001 మంది, ముస్లిం మైనారిటీలు 227 మంది, కాపు విద్యార్థులు 929, క్రిష్టియన్‌లు 41 మంది లబ్ది పొందుతున్నారని వివరించారు.
విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత
తమ ప్రభుత్వం విద్య. వైద్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని ఎంఎల్‌ఎ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పిల్లలందరూ చదువుకొని, విద్యావంతులు కావాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలన్నీప్రజలకు చేరువ చేసేందుకు జిల్లా అధికారులు బాధ్యతాయుతంగా కషి చేస్తున్నారని, వారికి తమవంతుగా సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నామని చెప్పారు.