Oct 05,2022 06:23

దేశంలో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్‌ సేవలను అందించడం తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రకటించారు. ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ ఆరో ఎడిషన్‌లో కొన్ని కార్పొరేట్‌ సంస్థలు అందించే 5జి సేవలను ప్రారంభిస్తూ ఆయన చేసిన ఈ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. 5జి సేవలతో దేశంలో టెలికాం విప్లవం రానుందని కూడా ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ సేవల మూలంగా ఇంటర్నెట్‌ వేగం పెరుగుతుంది. డౌన్‌లోడ్‌, అప్‌లోడ్‌ సమయం ఎంతో తగ్గిపోతుంది. అనేక కొత్త సాంకేతికతలను తేలికగా సాధించవచ్చు. అయితే, టెలికాం రంగంలో అత్యంత కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌ను విస్మరించి ఆ లక్ష్యాలను అందుకోవడం సాధ్యమేనా అన్నది అత్యంత కీలకమైన ప్రశ్న! దేశంలో 4జి సాంకేతికతను ప్రారంభించి ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు ఏ కార్పొరేట్‌ సంస్థలైతే 5జి సాంకేతికతను అందించడానికి ఉరుకులు పెడుతున్నాయో, దాదాపుగా అవే సంస్థలు 4జి సాంకేతికతను కూడా మార్కెట్‌ చేశాయి. అయితే, దేశంలో అన్ని మారుమూల ప్రాంతాలకు 4జి సేవలు అందాయా అంటే లేదనే సమాధానం వస్తుంది. కరోనా రక్కసి కోరలు చాచి విరుచుకుపడిన సమయంలో దేశంలో డిజిటల్‌ అంతరం ఎంతగా ఉందో స్పష్టంగా చూశాం. స్మార్ట్‌ ఫోన్లు కొనలేని దుస్థితిలో దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలు వున్నాయన్న సంగతిని కరోనా బట్టబయలు చేసింది. స్మార్ట్‌ ఫోన్లు ఉన్న వారు కూడా సిగల్‌ అందక చెట్లు, గుట్టలు ఎక్కి నానా తంటాలు పడాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడింది? ప్రధాని వత్తాసు పలికిన కార్పొరేట్‌ సంస్థలు గిట్టుబాటు కాదన్న కారణంతో సిగల్స్‌కు అవసరమైన మౌలిక వనరులను ఆ ప్రాంతాల్లో ఏర్పాటు చేయకపోవడం వల్లే కదా! ఇప్పుడు ఆ సంస్థలకే 5జి సేవలను అప్పగించి డిజిటల్‌ సమానత్వాన్ని సాధిస్తామంటే నమ్మడం ఎలా?
ప్రభుత్వరం బిఎస్‌ఎన్‌ఎల్‌ దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంది. టెలికాం వ్యవస్థను, టెలిఫోన్‌ను సామాన్యుడికి చేరువగా తీసుకువెళ్లింది. 3జి సాంకేతికతను దేశంలో ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆ సంస్థదే! ఒకప్పుడు దేశానికి 3జి సాంకేతికతను పరిచయం చేసిన బిఎస్‌ఎన్‌ఎల్‌ ఇంకా 4జి లోకి అడుగు పెట్టనే లేదు! ఈ ఏడాది నవంబర్‌లో ఆ సంస్థ 4జి లోకి అడుగు పెడుతుందని, వచ్చే ఏడాది చివరినాటికి 5జి సాంకేతికతను అందిపుచ్చుకుంటుందని చెబుతున్నారు. ఇది ఆచరణలోకి వచ్చేంతవరకు సందేహమే! మరోవైపు పాలక వర్గాల సహకారంతో జియో, ఎయిర్‌టెల్‌, వోడా వంటి కార్పొరేట్లు బిఎస్‌ఎన్‌ఎల్‌ మార్కెట్‌ను పట్టణ ప్రాంతాల్లో కబ్జా చేశాయి.
ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా 24,680 గ్రామాలకు 4జి సేవలు అందడం లేదు. వాస్తవంలో ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఈ గ్రామాలకు ఆ సేవలను విస్తరింపచేయడానికి ఘనత వహించిన కార్పొరేట్లు ముందుకు రావడం లేదు. భద్రతా కారణాల రీత్యా సున్నితమైన ప్రాంతాల్లోనూ, ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోనూ ఇంకా 2జి సాంకేతికతనే కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతాల్లోని ప్రజానీకం కూడా పూర్తి స్థాయిలో ఇంటర్‌నెట్‌ను అందిపుచ్చుకుంటేనే ప్రధాని చెప్పిన టెలికాం విప్లవం సాకారమవుతుంది. అది జరగాలంటే, డిజిటల్‌ కనెక్టివిటీని మారుమూల ప్రాంతాలకు విస్తరించడంతో పాటు, డేటా ధరను అందుబాటులో ఉంచి తీరాలి. బిఎస్‌ఎన్‌ఎల్‌ నూరు శాతం దేశీయ పరిజ్ఞానాన్ని వినియోగించి 4జి సాంకేతికను రూపొందించింది. 5జి కి కూడా అదే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఆత్మనిర్భర్‌ భారత్‌ పేరుతో స్వదేశీ జపం చేసే మోడీ సర్కారుకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా బిఎస్‌ఎన్‌ఎల్‌ 4జి ని ప్రజానీకానికి అందించాలి. 5జి సాంకేతికకు అవసరమైన స్పెక్ట్రమ్‌ను కేటాయించడంతో పాటు అడ్డంకులు తొలగించాలి. దీనివల్ల డేటా ధరలు తగ్గుముఖం పడతాయి. ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదాన్ని ఆచరణలో చూపిన తొలి ప్రభుత్వ రంగ సంస్థగా బిఎస్‌ఎన్‌ఎల్‌ నిలుస్తుంది. దీంతో పాటు ఆ సంస్థ పునరుద్ధరణకు ప్రకటించిన 67,464 కోట్ల రూపాయల ప్యాకేజిని తక్షణం విడుదల చేసి, విస్తరణ పనులు ముమ్మరం చేయాలి. అప్పుడే డిజిటల్‌ లక్ష్యాలు దేశ ప్రజలందరికీ అందుతాయి.