
ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారం కోరుతూ, మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 5వ తేదీన చేపడుతున్న చలో ఢిల్లీ కార్యక్రమానికి కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ఆశా, అంగన్‌వాడీ, మహిళా, యువత, విద్యార్థులందరూ తరలి వెళ్లి జయప్రదం చేద్దామని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు అన్నారు. ఆదివారం కార్మిక, కర్షక, మహిళా, యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న చేపడుతున్న చలో ఢిల్లీని జయప్రదం చేయాలని కోరుతూ జిల్లాలో చేపట్టిన జీపుజాతాను జెండా ఊపి ప్రారంభించారు. టవర్ క్లాక్ సర్కిల్ వద్ద నిర్వహించిన జీపు జాతాకు ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు హాజరై ప్రాంభించారు. అంతకు మునుపు మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతిని నిర్వహించారు. మల్లు స్వరాజ్యం చిత్రపటానికి ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఓబులు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు, కౌలురైతులు, ప్రజల సమస్యలను పరిష్కరించని దుస్థితి నెలకొందన్నారు. అత్యంత ధనవంతులైన ఆదానీ, అంబానీ వంటి వారి సేవలో మునిగి తేలుతూ దేశ రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలకు ఎదురు తిరగకుండా ఉండేందుకు మతం పేరుతో ప్రజలను విడగొట్టి పరిపాలిస్తున్నారని ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేకంగానూ, ప్రయివేట్ కార్పొరేట్ పెట్టు బడిదారులకు అనుకూలంగా ఉందన్నారు. ఇటు వంటి ప్రజా వ్యతిరేక విధానాలకు బదులుగా ప్రజానుకూల విధానాల కోసం ఏఫ్రిల్ 5న ఢిల్లీలో జరిగే కార్మిక, కర్షక, పోరాట ప్రదర్శనలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులను యజమానులకు బానిసలు చేసే విధంగా మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లను రద్దు చేయాలన్నారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్, టైమ్‌స్కేల్, డైలీవేజ్, గౌరవ వేతనం తదితర కార్మికులను రెగ్యులరైజేషన్ చేయాలన్నారు. కనీస వేతనాలు రూ.26 వేలు ఇవ్వాలని, పిఎఫ్, ఇఎస్‌ఐ అమలు చేయాలని కోరారు. జిల్లాలో సోలార్ విద్యుత్ పేరుతో అదానీ కంపెనీకి వేల ఎకరాలు అప్పగించడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధానాలపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్నారు. విద్యా వంతులు, మేధావుల ఎన్నికల్లో ఘోరంగా ఓడించి చెంపపెట్టులా హెచ్చరించారని తెలిపారు. మోడీ విధానాలను తూచా తప్పకుండా పాటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీరు చాలా బాధాకరమని అన్నారు. మోదీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేలా ఏప్రిల్ 5న చలో ఢిల్లీ చేపడుతున్నట్లు తెలిపారు. అందరినీ చైతన్య పరిచి పోరాటంలో భాగస్వాములను చేయడం కోసం జీపు జాతా చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నాగేంద్రకుమార్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి, కౌలురైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.బాలరంగయ్య, వ్యవసాయ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు సూరి, శ్రీనివాసులు, సిఐటియు నగర కార్యదర్శి వెంకటనారాయణ, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహారెడి,్డ మున్సిపల్ ఉద్యోగులు కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం, గ్రామ పంచాయతీ ఉద్యోగుల యూనియన్ జిల్లా కార్యదర్శి శివ ప్రసాద్, సిఐటియు నాయకులు ప్రకాష్‌రెడ్డి, ఆదినారాయణ, తిరుమలేష్, రామాంజనమ్మ, లక్ష్మీనరసమ్మ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మొదటి రోజు జీపు జాత చేసిన గ్రామాలు
కేంద్ర ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలని, కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మిక, కర్షకుల సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన జాపు జాతా తొలి రోజు అనంతపురం టవర్ క్లాక్ సర్కిల్ నుంచి ప్రారంభమయింది. బుక్కరాయసముద్రం, శింగనమల, నార్పల, పుట్లూరు, యల్లనూరు, తాడిపత్రి, యాడికి, పెద్దవడుగూరుకు చేరుకుంది.
గృహ నిర్భందాలు, అక్రమ అరెస్టులు అమానుషం
కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, స్కీం వర్కర్‌ల సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన ఛలో అసెంబ్లీ తలపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు, ఉద్యోగులు, స్కీం వర్కర్‌లను పోలీసులతో గృహ నిర్భంధాలు, అక్రమ అరెస్టులకు పాల్పడటం దుర్మార్గంగా ఉందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నాగేంద్రకుమార్ అన్నారు. కార్మిక సంఘాల నేతలను గృహ నిర్భందాలకు గురి చేయడం, అక్రమ అరెస్టులకు పాల్పడటం అమానుషంగా ఉందన్నారు. విద్యా వంతులు, మేధావులు శాసనమండలి ఎన్నికల్లో గుణపాఠం నేర్పినా రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మారకపోవడం విచారకరం అన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, కార్మికులు, రైతులు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ఆనావాయితీగా వస్తోందన్నారు. అలాంటి కనీసం సమస్యలను తెలిపే స్వేచ్చను కూడా రాష్ట్ర ప్రభుత్వం హరించేలా వ్యవహరిచడం సరికాదన్నారు. పోలీసులతో ఎంతో కాలం పరిపాలన చేయలేరని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి విధానాలు మంచిది కాదన్నారు.