Jul 29,2021 19:59

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 5వ తేదీన చలో పార్లమెంటు నిర్వహించనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తెలిపారు. గురువారం విజయవాడలోని మాకినేని బవసపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...  పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కమిటీతో కలిసి నేడు (శుక్రవారం) రాష్ట్ర గవర్నర్‌ దృష్టికి సమస్యలను తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు.
పోలవరం నిర్వాసితుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ఫ్రభుత్వాలు వాగ్ధానాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. పునరావాసం కల్పించకుండా కాఫర్‌ డ్యాం పూర్తి చేయడం వల్ల మన్యంలో 80 గ్రామాలు నీటమునుగుతున్నాయని, అక్కడి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. గ్రామాల్లోకి వరద నీరొస్తుండటంతో గిరిజనులు మరో గత్యంతరం లేక కొండలపైకి వెళ్లాల్సిన స్థితి వచ్చిందన్నారు. కొందరు 40, 50 కిలోమీటర్ల దూరం నడిచి వరద ముప్పు నుండి తప్పించుకోవాల్సి వస్తోందని చెప్పారు. 41.15 కాంటూరు లెవల్‌ వరకూ ఉన్న నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చిన తరువాతే తరలించాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వాసితుల బాధ్యత తనది కాదని, 2014 అంచనాల ప్రకారమే పునరావాస, పునర్నిర్మాణం అంచనాల మొత్తాన్ని ఇస్తామని, అంతకుమించి తమకు సంబంధం లేదని చెప్పడం అన్యాయమన్నారు. దీన్ని ప్రశ్నించి న్యాయంగా నిధులను రాబట్టుకోవల్సిన రాష్ట్ర ప్రభుత్వ ఆదిశలో తగినంత ఒత్తిడి తేవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి నిర్వాసితులను ఆదుకోవాలని, పనులు పోయిన వారికి సహాయం చేయాలని కోరారు. పునరావాస ప్యాకేజీకి అమలుకు ప్రధమ ప్రాధాన్యత ఇవ్వకపోతే నిర్వాసితుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చేందుకు, ప్రజల సహకారం పొందడానికి వీలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాజెక్టు పునరావాస కమిటీతో చర్చించాలని సూచించారు.