
ప్రజాశక్తి - గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలులో భాగంగా 104 వాహనాల సంఖ్యను గణనీయంగా పెంచుతున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో సోమవారం ఆమె ఈ వాహనాలను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో 104 వాహనాలు ప్రస్తుతం 672 ఉన్నాయని, కొత్తగా మరో 260 వాహనాలను అందుబాటులోకి తెచ్చినట్టు మంత్రి తెలిపారు. పల్నాడు జిల్లాలో ప్రస్తుతం 28 ఉండగా మరో 4 వాహనాలను అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. దేశంలోనే ఒక గొప్ప ఐకానిక్ ప్రోగ్రాం లాగా కుటుంబ వైద్య విధానం ట్రయిల్ రన్‌ను సిఎం గత నవంబర్‌లో ప్రారంభించారని, ఈ ట్రయిల్ రన్‌లో భాగంగా 14 రకాల పరీక్షలు, 74 రకాల మందులు ప్రవేశ పెట్టామని చెప్పారు. ఏప్రిల్ 6న కుటుంబ వైద్య విధానం సిఎం జగన్ అధికారికంగా ప్రారంభిస్తారని తెలిపారు. ఈ వాహనాల ద్వారా 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ వాహనాలు ప్రతి గ్రామానికి వారానికి రెండు సార్లు సందర్శిస్తారని, 104 వాహనంలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వైద్యాధికారి, సిబ్బంది గ్రామాన్ని వెళ్ళినప్పుడు ఆరోగ్యకార్యకర్తలు అందుబాటులో ఉంటారని మంత్రి వివరించారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ శోభారాణి, కుటుంబ వైద్య విధానం నోడల్ ఆఫీసర్ సిహెచ్ చంద్రశేఖర్, 104 జిల్లా మేనేజర్ విజరు కుమార్ పాల్గొన్నారు.