Nov 30,2022 21:45

ఎమ్మెల్యేను నిలదీస్తున్న గ్రామస్తులు

రొద్దం : 6నెలలైన గ్రామంలో రోడ్డు వేయక పోతే ఎలా అంటూ మండలంలోని శేషాపురం గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యేను బుధవారం నిలదీశారు. మండలంలోని శేషాపురం గ్రామంలో బుధవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే శంకరనారాయణ పాల్గొన్నారు. ఈసందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. రొద్దం నుంచి హిందూపురం వెళ్లి దారిలో శేషాపురం క్రాస్‌ నుంచి గ్రామం వరకు దాదాపు 1.5 కిలోమీటర్ల మేర తారురోడ్డు కొరకు దారిపై కంకర వేసి వదిలేశారన్నారు. 6నెలలైన రోడ్డు వేయకపోతే విద్యార్థులు పాఠశాలకు ఎలా వెళ్ళాలని ఎమ్మెల్యేను నిలదీవారు. స్పందించిన ఆయన నెల లోపు రోడ్డు పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే పాఠశాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రశేఖర్‌, వైసిపి మండల కన్వీనర్‌ తిమ్మయ్య, నాయకులు బి నారాయణ రెడ్డితో పాటు నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.