Jun 24,2022 08:50

గువహటి : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. తమకు మొత్తం 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని రెబల్‌కు నాయకత్వం వహిస్తున్న ఏక్‌నాథ్‌ షిండే ఓ మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు. వారిలో 40 మంది శివసేన ఎమ్మెల్యేలని చెప్పారు. రెబల్‌ ఎమ్మెల్యేలంతా గవర్నర్‌ను కలిసి.. బలపరీక్షకు దిగే అవకాశాలున్నాయి. వీరంతా ప్రస్తుతం అసోంలోని గువహటిలో రాడిసన్‌ బ్లూ హోటల్‌లో మకాం వేశారు. అయితే వీరిని అక్కడ ఉంచేందుకు భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. తిరుగుబావుటా వేసిన ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేలంతా తొలుత గుజరాత్‌లో మకాం వేయగా.. బుధవారానికి అసోంలోని గువహటిలోని విలాసవంతమైన రాడిసన్‌ బ్లూ హోటల్‌కు మారారు. ఇక్కడ వారుండేందుకు వారం రోజులకు 70 రూములు బుక్‌ చేశారని సమాచారం. ఈ హోటల్లో మొత్తం 196 గదులుండగా. 70 రూములు ఎమ్మెల్యేలకు కేటాయించారు. వారం రోజులకు గానూ.. వీటి ఖర్చు రూ. 56 లక్షలు కాగా, అదనంగా భోజనం, ఇతర ఖర్చులు కలిపి రోజుకు రూ. 8లక్షల చొప్పున ఖర్చుఅవుతుందని తెలుస్తోంది. కాగా, వీరు రాక మునుపు బుక్స్‌ చేసిన రూమ్స్‌ కాకుండా.. మరెవరికీ బుకింగ్‌ సౌకర్యాన్ని హోటల్‌ యాజమాన్యం కల్పించలేదు. అదేవిధంగా రెస్టారెంట్‌ సేవవలు కూడా హోటల్‌లో ఉన్న వారికి మినహా బయటవారిని అనుమతించట్లేదని సమాచారం. అలాగే బాంక్వెట్‌ కూడా మూసివేశారని.. హౌటల్లో బస చేసే వారికి మినహా బయటి వారిని రెస్టారెంట్‌లోకి అనుమతించట్లేదని తెలుస్తోంది. అదేవిధంగా వీరంతా గువహటి చేరుకునేందుకు చార్డర్‌ విమానాలు, రవాణా ఖర్చులు వీటికి అదనం.