
- ఐదుగురు నిందితుల అరెస్టు
ప్రజాశక్తి-సీలేరు : అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లు ఐదుగురిని స్థానిక పోలీసులు శనివారం అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 75 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జీకే వీధి సిఐ అశోక్ కుమార్ కథనం ప్రకారం... సీలేరు పోలీస్ స్టేషన్ పరిధి స్థానిక రామాలయం సెంటర్లో శుక్రవారం అనుమానస్పదంగా ఆరుగురు వ్యక్తులు సంచరిస్తున్న నేపథ్యంలో ఏఎస్ఐ అప్పారావు, సిఆర్పిఎఫ్ 42 బెటాలియన్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. వారి రాకను గమనించిన ఆ వ్యక్తులు వారి వద్ద ఉన్న గోనెసంచుల మూటలతో పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు చాకచక్యంగా వెంబడించి వారిలో ఐదుగురిని పట్టుకున్నారు. ఒకరు పారిపోయాడు. ఆ గోనె సంచుల్లో 75 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. నిందితులు దారకొండ పంచాయతీ కమ్మరతోట గ్రామానికి చెందిన కిలో గణేశ్వరరావు, కొర్ర ముని, మహారాష్ట్రకు చెందిన ఇర్ఫాన్ అహ్మద్ రాపేక్ షేక్, సంతోష్ బాబు చక్ర నారాయణ, ధరమ్ బీర్‌ను అరెస్టు చేశారు. 75 కేజీల గంజాయితో పాటు వారి నుంచి రూ.1400 నగదు, గంజాయి ప్యాకింగ్ ఉపయోగించే ఒక పరికరం, స్మార్ట్ ఫోన్, ఐటెల్ కీప్యాడ్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసకున్నారు. సిఐ అశోక్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా సిఐ విలేకర్లతో మాట్లాడుతూ సప్పల్ల సత్యమూర్తి అనే వ్యక్తి పరారైనట్లు తెలిపారు. ఆయన ఆచూకీ కోసం గాలిస్తున్నామన్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో సీలేరు ఎస్సై రామకృష్ణ పాల్గొన్నారు.