Sep 22,2022 17:04

హైదరాబాద్‌: గాడ్‌ ఆఫ్‌ మాసస్‌ నటసింహ నందమూరి బాలకృష్ణ 'చెన్నకేశవ రెడ్డి' థియేటర్స్‌ లో మాస్‌ జాతర సృష్టించింది. బ్లాక్‌ బస్టర్‌ దర్శకుడు వివి.వినాయక్‌ దర్శకత్వంలో సెప్టెంబర్‌ 25, 2002లో విడుదలైన ఈ చిత్రం బాక్స్‌ ఆఫీస్‌ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. 'చెన్నకేశవ రెడ్డి' మాస్‌ జాతర ఖండాంతరాలు దాటి 20 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఏ మాత్రం క్రేజ్‌ తగ్గని ఈ చిత్రాన్ని ఇప్పుడు సరికొత్త హంగులతో రీరిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాత బెల్లం కొండ సురేష్‌. ఈ నేపధ్యంలో దర్శకుడు వివి.వినాయక్‌ తో కలసి విలేకరుల సమవేశం నిర్వహించి రీరిలీజ్‌ విశేషాలని పంచుకున్నారు.
నిర్మాత బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ.. 'చెన్నకేశవ రెడ్డి'ని భారీగా రీరిలీజ్‌ చేయడం చాలా ఆనందంగా వుంది. ఇరవైఏళ్ల కిందట ఎంత హైబడ్జెట్‌ తో, క్రేజీగా ఈ సినిమా నిర్మించామో, అంతే క్రేజీగా ఇప్పుడు సినిమా రీరిలీజ్‌ అవుతుంది. తెలుగు ప్రేక్షకులందరూ మళ్ళీ చూసి అదే థ్రిల్‌ ఫీలౌతారని నమ్ముతున్నాను. రీరిలీజ్‌ గురించి బాలకృష్ణ గారికి చెప్పగానే ఆయన సపోర్ట్‌ ని తెలిజేశారు. ఆ రోజుల్లో వినాయక్‌ ఒక పూనకం వచ్చే లాగా సినిమా తీశారు. యాక్షన్‌, చేజ్‌, సుమోలు, హెలీ క్యాప్టర్లు, భారీగా జనాలు.. అంతా ఒక అద్భుతంలా వుంటుంది 'చెన్నకేశవ రెడ్డి'. మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించారు. ఇప్పటికీ ఒక గొప్ప థ్రిల్‌ ఇచ్చే సినిమా అవుతుంది. ఎక్కడ అడ్వాన్స్‌ బుకింగ్‌ ఓపెన్‌ చేసినా ఒక అరగంటలో ఫుల్‌ అయిపోయి మళ్ళీ షోలు పెంచే పరిస్థితి వుండటం గొప్ప ఎనర్జీ ఇస్తుంది. సెప్టెంబర్‌ 24న ప్రిమియర్‌ షోలతో మొదలుపెట్టి, 25న రెగ్యులర్‌ షోలు వుంటాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 300 థియేటర్స్‌ లో సినిమాని ప్రదర్శిస్తున్నాం. రీరిలీజ్‌ లో ఒక సినిమాని కోటి రూపాయిలకి అడిగినా దాఖలాలు ఎక్కడా లేవు. కానీ ఈ సినిమాని రిలీజ్‌ చేస్తామని చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్‌, ఎక్సిభిటర్స్‌ కోటి రుపాయిలకి అడగడం చెన్నకేశవ రెడ్డి' క్రేజ్‌కి నిదర్శనం. సినిమాని సరికొత్తగా డిఐతో పాటు 5. 1 హంగులతో తీర్చిదిద్దాం. ఈ సినిమాకి వచ్చే రెవెన్యూలో 75 శాతం బాలకృష్ణ గారి బసవతారకం ట్రస్ట్‌ కి, మిగతాది నాకు సంబధించిన అసోషియేషన్స్‌ కి ఇవ్వాలని నిర్ణయించాం. నవంబర్‌ నుండి మళ్ళీ యాక్టివ్‌ గా ప్రొడక్షన్‌ మొదలుపెట్టాలని అనుకున్నాను. కానీ సెప్టెంబర్‌ లో 'చెన్నకేశవ రెడ్డి' రీరిలీజ్‌ తో గొప్ప ఎనర్జీ వచ్చింది. కమర్షియల్‌గా కాకుండా మంచి ఉద్దేశం కోసం ఈ సినిమాని రీరిలీజ్‌ చేస్తున్నాం. ప్రేక్షకులు, అభిమానులు ఈ మంచి ఉద్దేశంలో భాగమై ఆదరించాలి'' అని కోరారు
వివి వినాయక్‌ మాట్లాడుతూ.. 'కొన్నిసార్లు అనుకోకుండా ఆనందం వస్తుంది. అలాంటి ఆనందం ఇచ్చింది 'చెన్నకేశవ రెడ్డి'. ఈ సినిమా షూటింగ్‌ చేస్తున్నపుడు కొన్నిగంటలు మాత్రమే నిద్రపోయాను. బాలయ్య గారిని ఎలా ప్రజంట్‌ చేయాలనే పిచ్చితోనే వుండేవాడిని. అప్పటికి రెండో సినిమానే చేస్తున్న నాకు బాలయ్య గారు ఎంతో మర్యాద ఇచ్చారు. ఆయన మర్యాద మర్చిపోలేను. ఈ సినిమాకి పని చేసినందరికీ పేరుపేరున కృతజ్ఞతలు. బాలయ్య గారితో పని చేయడం మర్చిపోలేని అనుభూతి. బాలయ్య బాబు గారికి ఎన్నో సూపర్‌ హిట్లు వున్నాయి. కానీ ఈ సినిమాని ఎక్కువగా ఓన్‌ చేసుకున్న బాలయ్య బాబు అభిమానులకు కృతజ్ఞతలు. ఈ సినిమానే రిరిలీజ్‌ చేయాలని అభిమనులు పట్టుబట్టారు. చాలా మంచి ఉద్దేశం కోసం ఈ సినిమాని రిలీజ్‌ చేస్తున్నాం. ఈ సినిమాలో వచ్చే మేజర్‌ రెవెన్యు బసవతారకం ట్రస్ట్‌ కి విరాళంగా ఇస్తున్నాం. ఇరవై ఏళ్ల క్రితం ఒక పండగలా ఈ సినిమాని విడుదల చేశాం. ఇప్పుడు కూడా రిరిలీజ్‌ లా లేదు. కొత్త సినిమా రిలీజ్‌ చేసినట్లే అనిపిస్తుంది. మంచి ఉద్దేశం కోసం రీరిలీజ్‌ అవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు, అభిమానులు ఆదరించాలి'' అని కోరారు.