
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 750 మీటర్ల త్రివర్ణ పతాకంతో గుంటూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం ఆరు గంటలకే నగరం మొత్తం జాతీయ పతాకాలతో విద్యార్థులు బారులు తీరారు. 750 మీటర్ల త్రివర్ణ పతాకంతో కలెక్టరేట్ నుంచి ఎన్‌టిఆర్ స్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి శనివారం జెండా ఊపి ప్రారంభించారు. రాజకీయ, స్వచ్ఛంద సంస్థలు, వర్తక, వాణిజ్య సంస్థల ప్రతినిధులు, పాఠశాల, కళాశాల విద్యార్థులు, ఎన్‌సిసి క్యాడెట్‌లు, డ్వాక్రా గ్రూపు సభ్యులు, జెండాను పట్టుకుని ముందుకు నడిచారు. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.