Feb 06,2023 23:01

ప్రజాశక్తి-విజయవాడఅర్బన్‌: తరుణీ తరంగాలు ఆధ్వర్యంలో ఈ నెల 8, 9 తేదీల్లో నగరంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో 5వ మహిళా ఫెస్ట్‌ నిర్వహించనున్నట్లు తరుణీ తరంగాలు అధ్యక్షురాలు డాక్టర్‌ రావి శారద తెలిపారు. గవర్నరుపేటలోని బాలోత్సవ్‌ భవన్‌లో సోమవారం తరుణీ తరంగాలు ఆధ్వర్యంలో పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శారద మాట్లాడుతూ స్త్రీ శక్తిని వెలికితీసి సమాజంలో మహిళలకు గౌరవప్రదమైన, భద్రమైన స్థానం కోసం వివిధ కార్యక్రమాలు, కళారూపాలతో ఈకార్యక్రమం ఉంటుందని తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈఫెస్ట్‌లో కళాశాల విద్యార్థినులు, మహిళలు పాల్గొనవచ్చని తెలిపారు. ఇప్పటికే పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని తెలిపారు. సుమారు 20 అంశాలలో పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. చిత్రలేఖనం, తెలుగు కవితా రచన, కథా రచన, బెస్ట్‌ ఫ్రమ్‌ వేస్ట్‌, దేశభక్తి అభ్యుదయ గీతాలాపన, కోలాటం, వ్యాసరచన, వక్తృత్వం, వెజిటబుల్‌ కార్వింగ్‌, ఏకపాత్రాభినయం,. జానపద గీతాలాపన, లఘునాటిక ఉంటాయన్నారు. జానపద నృత్యం, శాస్త్రీయత నృత్యం, స్పాట్‌ స్కిట్స్‌ ఉంటాయని తెలిపారు. నగరంలోని అన్ని మహిళా సంఘాలు, ప్రయివేటు, ప్రభుత్వ వ్యాపార సంస్థలలోని మహిళా ఉద్యోగులతో పాటు విజయవాడ నగర పరిసర ప్రాంతాలలోని కళకాశాల విద్యార్థినులు, మహిళలు పాల్దొంటారని తెలిపారు. 8వ తేదీ ఉదయం పది గంటలకు జరిగే ప్రారంభ సభకు అతిధులుగా ప్రముఖ రచయిత్రి ఓల్గా, ఎం.ఎం. నాయక్‌, అమెరికా అండర్‌ 19 మహిళా క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ గీతిక పాల్గొంటారని తెలిపారు. 9వ తేదీ సాయంత్రం జరిగే ముగింపు కార్యక్రమానికి అతిధులుగా సిద్ధార్థ అకాడమి అధ్యక్షులు డాక్టర్‌ చదలవాడ సుధ, ఫ్యామిలీ అండ్‌ హెల్త్‌ కమిషనర్‌ జె.నివాస్‌, మునిసిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకరన్‌, ఎస్‌బిఐ డిజిఎం కె.రంగరాజన్‌ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తరుణీ తరంగాలు ఉపాధ్యక్షులు డాక్టర్‌ ఎన్‌.విద్యాకన్నా, డాక్టర్‌ ఎస్‌.కల్పన, సెక్రటరీ డి.రమాదేవి, కె.స్వరూపా రాణి, కె.శ్రీదేవి, జి.జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.