Oct 17,2020 20:10

షార్జా : టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఎనిమిది ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టానికి 47 పరుగులు చేసింది. తుషార్‌ దేశ్‌పాండే వేసిన తొలి ఓవర్‌లో మూడో బంతికి ఓపెనర్‌ శామ్‌ కరన్‌ (0) ఎన్రిచ్‌ నోర్జే చేతికి చిక్కి పెవిలియన్‌ చేరాడు. కట్టుదిట్టమైన బంతులు వేయడంతో ఆ ఓవర్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. కగిసో రబడ అద్భుత బంతులు సంధించడంతో రెండో ఓవర్‌ మెయిడెన్‌గా నమోదైంది. దేశ్‌పాండే వేసిన మూడో ఓవర్‌లో షేన్‌ వాట్సన్‌ రెండు ఫోర్లు బాడదంతో ఆ ఓవర్‌లో మొత్తం పది పరుగులు వచ్చాయి. నాలుగో ఓవర్‌లో అక్షర్‌ పటేల్‌ కట్టుదిట్టమైన బంతులేసి కేవలం మూడు పరుగులే ఇచ్చాడు. నోర్జే వేసిన ఐదో ఓవర్‌లో డుప్లెసిస్‌ రెండు ఫోర్లు, సిక్స్‌తో చెలరేగిపోవడంతో ఆ ఓవర్‌లో 14 పరుగులు వచ్చాయి. రబడ వేసిన ఆరో ఓవర్‌లో డుప్లెసిస్‌, వాట్సన్‌ చెరో బౌండరీ బాది పది పరుగులు తీశారు. కట్టుదిట్టమైన బంతులు వేసిన అక్షర్‌ పటేల్‌ ఏడో ఓవర్‌లో నాలుగు, రవిచంద్రన్‌ అశ్విన్‌ ఎనిమిదో ఓవర్‌లో నాలుగు పరుగులే ఇచ్చారు. దీంతో ఎనిమిది ఓవర్లు ముగిసే సరికి చెన్నై వికెట్‌ నష్టానికి 47 పరుగులు చేసింది.