Aug 02,2022 11:17

షాదోల్‌ : ఆసుపత్రిలో అంబులెన్స్‌ లేకపోవడంతో.. ప్రైవేటు వాహనానికయ్యే ఖర్చును భరించలేక.. తల్లి మృతదేహాన్ని కుమారుడు బైక్‌ మీదనే 80 కిలోమీటర్లు తీసుకెళ్లాడు. ఈ హృదయవిదారక ఘటన మధ్యప్రదేశ్‌లోని షాదోల్‌లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. అనుప్పుర్‌ జిల్లాకు చెందిన జైమంత్రి యాదవ్‌ (60) అనే మహిళకి గుండెనొప్పి రావడంతో.. ఆమె కుమారుడు చికిత్స కోసం షాదోల్‌లోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి తీసుకువచ్చారు. ఆ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ.. శనివారం అర్థరాత్రి మృతి చెందింది. అయితే ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాలంటే.. ఆ సమయంలో ఆసుపత్రిలో అంబులెన్స్‌ అందుబాటులో లేదు. దీంతో ప్రైవేటు వాహనానికయ్యే రూ.5వేలు ఖర్చును భరించలేక తల్లి మతదేహాన్ని బెడ్‌షీట్లో చుట్టి.. చెక్కపై పెట్టుకుని, బైక్‌కు కట్టి, మరొకరిని వెనక కూర్చోబెట్టుకుని తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా, ఈ ఘటనపై కుమారుడు మాట్లాడుతూ.. ఆసుపత్రిలో అంబులెన్స్‌ లేదని ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో.. తాను బైక్‌పై తీసుకెళ్లాల్సి వచ్చిందని వాపోయాడు. అయితే దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ స్పందించారు. అసలు అతను అంబులెన్స్‌ అడగలేదని... ఒకవేళ అతను అడిగినట్లయితే ఆసుపత్రిలో అంబులెన్స్‌లు లేకపోయినా.. జిల్లా ఆసుపత్రి నుంచో.. లేక స్థానిక సంస్థల నుంచో వాటిని సమకూర్చేవారమని అన్నారు.