May 05,2021 09:02

ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖ) : దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం దారుణమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు వైటి.దాస్‌ అన్నారు. కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్‌ ఆర్చి వద్ద జరుగుతున్న రిలే దీక్షలు మంగళవారానికి 82వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో ఎంఎంఎస్‌ఎం విభాగ ఉద్యోగులు కూర్చున్నారు. ఈ సందర్భంగా దాస్‌ మాట్లాడుతూ ఉక్కు ఉద్యోగుల సంక్షేమం, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం కోసం ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఇదేనన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ఉక్కు ఉద్యోగులు ప్లాంట్‌ను లాభాల్లోకి తీసుకొచ్చేందుకు విశేషంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలనతోనే కరోనా కేసులు పెరుగుతున్నాయని విమర్శించారు. మోడీ స్వార్థపూరిత రాజకీయాలను విడనాడి ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. లేకుంటే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.