
న్యూఢిల్లీ: భారత టాప్‌క్లాస్ షట్లర్ల జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ బిడబ్ల్యుఎఫ్ తాజా ర్యాంకింగ్స్‌లో 8వ స్థానంలో నిలిచింది. భారత్ వేదికగా జరిగిన ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ డబుల్స్ టైటిల్‌ను ఈ జోడీ కైవసం చేసుకోవడంతో వారి ర్యాంకింగ్ మెరుగైంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య(బిడబ్ల్యుఎఫ్) మంగళవారం ప్రకటించిన ర్యాంకింగ్‌లో పివి సింధు, కిదాంబి శ్రీకాంత్ తమ తమ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరుచుకున్నారు. మహిళల సింగిల్స్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్ పివి సింధు 90,994పాయింట్లతో 7వ స్థానంలో ఉండగా.. పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ 69,158 పాయింట్లతో 10వ స్థానంలో నిలిచాడు. ఇక మహిళల ర్యాంకింగ్స్‌లో తైజు-యింగ్(చైనీస్ తైపీ) 1,08,800పాయింట్లు, ఒలింపిక్ ఛాంపియన్ విక్టర్ అక్సెల్సన్ 1,16,779పాయింట్లతో ఆయా విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచారు. చిరాగ్-సాత్త్విక్ జోడీ 76,708పాయింట్లతో డబుల్స్‌లో 8వ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో ఇండోనేషియాకు చెందిన మహ్మద్ హసన్-హెండ్రా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జోడీని ఇండియా ఓపెన్‌లో భారత డబుల్స్ జోడీ చిత్తు చేయడంతో వారి ర్యాంకింగ్స్ మెరుగైంది.