May 07,2023 17:33

భువనేశ్వర్‌   :   రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తుండగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అయినప్పటికీ చీకట్లోనే రాష్ట్రపతి ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ ఘటన ఒడిశాలోని మయూర్‌ భంజ్‌జిల్లాలో శనివారం జరిగింది. వివరాల ప్రకారం.. ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా బరిపాడలోని మహారాజా శ్రీ రామచంద్ర భంజదేవ్‌ వర్సిటీ 12 స్నాతకోత్సవం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి హాజరయ్యారు. రాష్ట్రపతి ప్రసంగం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే    మైక్‌ సిస్టమ్‌ సహా వేదిక అంతా చీకట్లో మునిగిపోయింది. శనివారం ఉదయం 11.56నిమిషాల నుండి 12.05 నిమిషాల వరకు సుమారు 9 నిమిషాల పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. చీకట్లోనే రాష్ట్రపతి   ప్రసంగం కొనసాగించారు.  చీకటి వెలుగులను సమానంగా చూడాలనే విషయాన్ని ఈ ఘటన నుంచి నేర్చుకోవాలని విద్యార్థులనుద్దేశించి  అన్నారు.  అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించారు. టాటాపవర్‌, నార్త్‌ ఒడిశా పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ లిమిటెడ్‌ సిఇఒ భాస్కర్‌ సర్కార్‌ మాట్లాడుతూ.. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగలేదని, వైరింగ్‌లో లోపం కారణంగా విద్యుత్‌ నిలిచిపోయిందని అన్నారు. ఈ ఘటనపై యూనివర్శిటీ వైస్‌ చాన్సలర్‌ విచారంవ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగం సమయంలో విద్యుత్‌ సరఫరాలో లోపం తలెత్తడంపై క్షమాపణలు తెలిపారు. జనరేటర్‌ ఉన్నప్పటికీ.. ఆ సమయంలో ఉపయోగం లేకపోయింది.