Jul 30,2021 00:53

చెక్కు అందజేస్తున్న కలెక్టర్‌ మల్లికార్జున, మేయర్‌ గొలగాని తదితరులు

ప్రజాశక్తి - మహారాణిపేట
పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెన పథకం కింద జిల్లాలో 96,403 మంది విద్యార్థులకు రూ.59,96,28,005 జమ చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున తెలిపారు. విద్యా దీవెన ఆర్థిక సహాయాన్ని గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి, తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయం నుండి బటన్‌ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేశారు. విశాఖపట్నం కలెక్టరేట్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టరు డాక్టర్‌ మల్లికార్జున, మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి విద్యార్థుల తల్లులకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ పథకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఈ పథకం అంతా పారదర్శకంగాను, సులభంగాను ఉండి లబ్థిదారుల ఖాతాలో నేరుగా జమ కాబడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెసి-3 ఆర్‌.గోవిందరావు, ఎస్‌డబ్ల్యు జెడి రమణమూర్తి, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.