Jul 29,2021 22:41

9న ఆందోళనల జయప్రదానికి పిలుపు

ప్రభుత్వాల రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ ఆగస్టు 9న క్విట్‌ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో నిర్వహించే ఆందోళనలను విజయవంతం చేయాలని పలువురు పిలుపు ఇచ్చారు. గురువారం జిల్లాలో పలుచోట్ల సన్నాహక కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రజాశక్తి-యంత్రాంగం

పిఠాపురం నండూరి ప్రసాదరావు భవనంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సిఐటియు, రైతు, వ్యవసాయ, కార్మిక, కౌలు రైతుల సంఘాల నాయకులు జి.అప్పారెడ్డి, కె.సింహాచలం, కె.చిన్న నాయకులు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చట్టాలు, కార్మిక హక్కుల కాల రాసే చట్టాలు తీసుకు వస్తోందన్నారు. ఈ సమావేశంలో కె.విశ్వనాధం, కె.నాగేశ్వరావు, డి.సత్యనారాయణ, ఎం.సూరిబాబు, పి.గోవిందాచారి, ఆర్‌.భూలోకం, భాస్కర్‌, కోనేటి రాజు, బి.విజయబాబు, వి.సూర్య నారాయణ, జి.వీరబాబు పాల్గొన్నారు. ప్రత్తిపాడులో సిఐటియు మండల కన్వీనర్‌ రొంగల ఈశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో జిల్లా నాయకురాలు ఎన్‌.ఈశ్వరి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎం.వెంకటేష్‌, మరియమ్మ, హెచ్‌.వెంకట లక్ష్మి, నాగమణి, సిహెచ్‌.మంగ పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆశ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకురాలు అన్నామణి మాట్లాడారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.పూర్ణిమారాజు, అంగన్‌వాడీ నాయకురాలు సునీత మాట్లాడారు. ఆశాలు, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు.