Feb 07,2023 11:27

ప్రజాశకి-అమరావతి బ్యూరో : దేశ ఉత్పాదక రంగంలో కీలకమైన రవాణా రంగం కార్మికులకు సమగ్ర కార్మిక చట్టం తీసుకురావాలని ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌ లక్ష్మయ్య డిమాండ్‌ చేశారు. విజయవాడలో ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యాన సోమవారం సదస్సు జరిగింది. సిఐటియు రాష్ట్ర నాయకులు కె దుర్గారావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఆర్‌ లక్ష్మయ్య మాట్లాడారు. ప్రతిఏటా రవాణా రంగం నుంచి కేంద్ర ప్రభుత్వానికి రూ.మూడు లక్షల కోట్లకు పైగా ఆదాయం వస్తుంటే, అందులో పనిచేసే కార్మికుల సంక్షేమం కోసం రూ.20 వేల కోట్లను ఖర్చు చేయాలని కోరితే కేటాయింపులు చేయకపోవడం అన్యాయమని అన్నారు. రవాణా రంగంలో ఎంత మంది కార్మికులు పనిచేస్తున్నారో అనే లెక్కలు కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద లేకపోవడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పనిచేసే రవాణా రంగ కార్మికులకు సమగ్ర కార్మిక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. రవాణా రంగాన్ని నిర్యీర్యం చేసేలా భారాలు వేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రమాద బీమా, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎపి లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌, రోడ్‌ ట్యాక్స్‌, గ్రీన్‌ ట్యాక్స్‌, టోల్‌ ట్యాక్స్‌ ఇన్సూరెన్స్‌ రేట్లు పెంచడం ద్వారా లారీ రంగం కుదేలైపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రవాణా రంగంలో కీలక పాత్ర వహిస్తున్న లారీ రంగాన్ని నిర్వీర్యం చేయటం సహించరానిదన్నారు. రవాణా రంగాన్ని కాపాడుకునేందుకు కార్మికులతో కలిసి తమ సంఘం పోరాటాలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. కమర్షియల్‌ వెహికల్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు పెనుమత్స అప్పలరాజు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోటార్‌ కార్మికులకు సంక్షేమ పథకాలు అందించడంలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. మోటార్‌ కార్మికులకు ప్రమాదాలు జరిగిన సందర్భంలో ప్రభుత్వాల నుంచి ఎటువంటి నష్టపరిహారం అందకపోవటంతో ఆ కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎన్‌సిహెచ్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.