Sep 18,2023 07:09

ఇటీవల జబల్పూర్‌లో జరిగిన 18వ జాతీయ అభ్యుదయ రచయితల సంఘం మహాసభల్లో పెనుగొండ లక్ష్మీనారాయణ అరసం జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా... చిరు ముఖాముఖి.

                                               అరసం జాతీయ అధ్యక్షునిగా ఎంపికవడం పట్ల మీ అనుభూతి ?

అభ్యుదయ రచయితల సంఘం (అరసం)తో నా ప్రయాణం 1973 ఆగస్టు 10 నుంచి 12వ తేదీల వరకూ గుంటూరులో జరిగిన ఆరవ రాష్ట్ర మహాసభల నుంచీ సాగుతోంది. అప్పుడు నా వయసు 19 ఏళ్లు. ఇప్పుడు 69 సంవత్సరాలు. ఈ ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో గుంటూరు జిల్లా కార్యదర్శి బాధ్యతల నుంచి ఉమ్మడి ఆం.ప్ర. ప్రధాన కార్యదర్శి, అధ్యక్ష బాధ్యతలతో సహా జాతీయ కార్యదర్శి పాత్రను కూడా నిర్వహించాను. ఇప్పుడు అరసం జాతీయ అధ్యక్షునిగా 2023 ఆగస్టు 20 - 22 తేదీల్లో జబల్పూర్‌లో జరిగిన 18వ జాతీయ మహాసభల్లో బాధ్యతలు చేపట్టాను. 1936 ఏప్రిల్‌ 9-10 తేదీల్లో అరసం ఆవిర్భవించిన తర్వాత ఒక తెలుగు సాహితీవేత్త అధ్యక్ష పదవికి ఎంపిక కావడం ఇదే తొలిసారి. అందుకు చాలా సంతోషిస్తున్నాను. ప్రేమ్‌చంద్‌్‌, సజ్జాద్‌ జహీర్‌, డా.అబ్దుల్‌ అలీం, శ్రీపాద అమృత డాంగే, డా.విఖాస్‌ శర్మ, కిషన్‌ చందర్‌, విష్ణుదేవ్‌, భీష్మ సహానీ, గులాం రబ్బానీ, రాజీవ్‌ సక్సేనా, డా.ఓ.ఎన్‌.వి కురూప్‌, డా.ఖగేంద్ర ఠాకూర్‌, డా.కమలాప్రసాద్‌, డా.నాంవర్‌ సింగ్‌, డా.పొన్నీలన్‌ వంటి సుప్రసిద్ధ భారతీయ రచయితల నాయకత్వంలో నడచిన అరసంలో నేను అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడం ద్వారా ఒక గొప్ప వారసత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని గర్వంగా భావిస్తున్నాను.
 

                                                    అరసం తన ఎనభై యేళ్ళ ప్రస్థానం గురించి ...

అరసానికి జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో విశిష్టమైన నేపథ్యం ఉంది. తెలుగు నేలను ఆధునిక దృష్టితో అభ్యుదయ పథంలో నడపిన వైతాళికులను స్ఫూర్తిగా తీసుకుంది. మార్కి ్సజం సైద్ధాంతిక దృక్పథం అరసానిది. అందుచేతనే అరసానికి విలువైన గతం, బలమైన వర్తమానం, ఆశావహమైన భవితవ్యం ఉన్నాయి.
 

                            అరసం ఏ రాజకీయ పక్షానికి అనుబంధ సంస్థ కాదనే తీర్మానానికి ఇప్పటికి కట్టుబడి ఉందా ?

అరసం ఏ రాజకీయ పక్షానికి అనుబంధ సంస్థ కాదు. అయితే అరసం భావజాలాన్ని గుర్తించి గౌరవించే వామపక్ష, ప్రజాస్వామిక రాజకీయ పక్షాలు, సంస్థలు అందించే తోడ్పాటును స్వీకరిస్తుంది. కలిసి పనిచేస్తుంది.
 

                              అరసంలో ఎక్కువ యువకవులను తయారు చేసే దిశగా ఏదైనా కార్యాచరణ ఉందా ?

అరసం జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో యువకుల కోసం సాహిత్య పాఠశాలలను నిర్వహిస్తూనే ఉంది. 1946 మే 1 నుంచీ జూన్‌ 10 వరకూ ప్రఖ్యాత చరిత్రకారులు, సాహితీవేత్త అయిన మల్లంపల్లి సోమశేఖర శర్మ ప్రధానాచార్యుడిగా గుంటూరు జిల్లా పెదపూడి గ్రామంలో నిర్వహించిన చారిత్రాత్మక ఆంధ్ర సాహిత్య పాఠశాల నుంచి నేటివరకూ అరసం ప్రణాళికాబద్ధంగా నిర్ధుష్ట కార్యాచరణతో వివిధ ప్రక్రియలను, సాహిత్య పాఠశాలలను నిర్వహిస్తూనే ఉంది.
 

                                                     అరసం తరఫున ప్రచురణల విషయంలో మీ ప్రణాళిక

అరసం ఆవిర్భావం నుంచి తెలుగునాట 'తెలుగు తల్లి', 'అభ్యుదయ' పత్రికలతో పాటు వేలాది పుస్తకాలను ప్రచురించింది. ఇటీవల 'ఈ తరంకోసం' శీర్షికన కథాస్రవంతి పేరుతో 51 సంపుటాలను ప్రచురించింది. ఇంకా ఈ కథా సంపుటాల ప్రచురణ కొనసాగుతూనే ఉంది. ఇంకా వివిధ ప్రక్రియలతో పుస్తకాలను వెలువరించాల్సి ఉంది. ఇవన్నీ ప్రధానంగా యువతరం కోసం ప్రణాళికాబద్ధంగా కొనసాగిస్తున్న ప్రచురణలు.
 

                                          మీ అధ్యక్షతన అరసం భవిష్యత్‌ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ?

అరసం జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలకు, ప్రాంతాలకు, భాషలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సుదీర్ఘ చరిత్ర ఉన్న సాహిత్య సంస్థ. తరువాత ఏర్పడిన అనేక సాహిత్య సంస్థల మూలాలు అరసంలో ఉన్నాయి. జాతీయ స్థాయిలో సమర్ధవంతమైన నాయక బృందం ఉంది. నాకున్న అనుభవంతో అందరినీ సమన్వయం చేస్తూ, భావజాలపరంగా సన్నిహిత సంస్థలతో కలిసి సమైక్య కార్యాచరణ చేపట్టడానికి కృషి చేస్తాను. నేడున్న సంక్లిష్ట, సంక్షోభ పరిస్థితుల్లో సాంస్క ృతిక పునర్వికాస ఉద్యమం అవసరమనే భావనను ముందు తీసుకుని వెళ్ళాలన్న ఆలోచన అరసానికున్నది. ఈ దిశగా కూడా కృషి కొనసాగిస్తాను.
 

సంభాషణ : టేకుమళ్ల వెంకటప్పయ్య