
గత సంవత్సరం తెనాలి కళల కాణాచి వారి నాటికల పరిషత్తులో మొదటిసారి పోటీపడి గుర్తింపు తెచ్చుకొని, ఇప్పటికే పలుచోట్ల ప్రదర్శిస్తూ బహుమతులు గెల్చుకున్న, గెలుచుకుంటున్న చైతన్య కళా సమితి కరీంనగర్ వారి నాటిక చీకటిపువ్వు. రచన, పిఎస్ నారాయణ. నాటకా అనుసరణ పరమాత్ముని శివరాం.
చీకటి పువ్వు ... పేరు నాటికను చూడాలనే ఉత్సుకత కలిగిస్తుంది. ఈ చీకటి పువ్వుకి ఒక శరీరాన్ని, దానికి ఒక పేరు ఇస్తే .. అది 'పవిత్ర'. ఉదాత్తంగా ఈ పాత్రను తీర్చిదిద్దడంలో రచయిత ఉద్దేశం- ''పరిస్థితులకి ఏ మనిషీ అతీతం కాదు. అవసరంతోనో, వేరే అవకాశం లేకో, చాలామంది తప్పులు చేయటం సహజం. తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడిన తర్వాత కూడా వారిని దూరం పెట్టకండి. క్షమించి దగ్గరకు తీయండి. క్షమించడంలోనే నిజమైన ప్రేమ ఉంది'' అనే మానవత్వాన్ని మేల్కొల్పటం. కథా మూలానికి చక్కని సంభాషణలు, సన్నివేశాలు, సస్పెన్స్, ఉద్రేకాలు, ఉద్వేగాలు, అపనమ్మకాలు, ఆత్మవిశ్వాసం, అవసరాలు మనుషుల్ని ఏ బంధాలు లేకపోయినా ఎలా దగ్గరగా మనసును కట్టివేస్తాయో చెప్పే నాటిక ఇది.
అర్ధరాత్రి ఒక స్త్రీ, పర పురుషుని గదిలో ఉండటం, ఆ గదిలో అప్పుడే చనిపోయిన వ్యక్తి శవం ఉండడం, పక్కింటి వాటాల్లో ఉన్న ఇద్దరి సహాయం తోడు తీసుకోవడం, అందులో ఒకరు అర్థం చేసుకుంటే ... మరొకరు అవకాశం దొరికింది కదా అని ఆమెను తన శూలాల్లాంటి మాటలతో గుచ్చి గుచ్చి చంపటం .. కథను ఆసక్తికరం చేస్తుంది. ఒక మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చాలన్న ఆమె తపనను ... కుటుంబ సభ్యులు అపార్థం చేసుకుంటారు. అంతిమంగా ఆమె మానసిక పవిత్రతను గుర్తించి మనిషిని బట్టి, చేసే వృత్తిని బట్టి, గుణాన్ని అంచనా వేయటం పొరబాటని గ్రహిస్తారు. ఈ నాటిక ముఖ్య పాత్రల గురించి చూద్దాం.
పవిత్ర : మూడు నిమిషాల సుఖం కోసం ఏడడుగుల దూరంలో శవాన్ని పెట్టుకుని మాటలతో వేధించే సోకాల్డ్ సభ్య సమాజంలో.. మంచివాళ్లే తన దీనస్థితికి కారణం అంటుంది. ఎందుకంటే ఆ మంచి వాళ్ళు ఆమెని రతి పుత్రికగా, శృంగారనేత్రిగా, సుఖ ధాత్రిగా మాత్రమే చూస్తారు కాబట్టి. అలా 'చీకటి' ఆమె జీవితంలో కాస్తంత వెలుగు. అలాంటి ఒకానొక చీకటి పువ్వామే! తన జీవిత సర్వస్వం అయిన పిల్లాడి చదువు కోసం వ్యభిచారం చేస్తూ, 'తెల్లవారుజాము రెండు గంటలకు నన్ను వదిలేస్తారా? వాడిని లేపి పరీక్షలకు చదివించాలి' అని దీనంగా అడిగితే, ఆ మాటలు ఎంత బలంగా తాకుతాయో కదా! ఆమె జీవితంలోకి మొదటిసారి, ఓ సజ్జనుడు తారసపడతాడు. అయితే అతడి హఠాన్మరణం ఇప్పుడు ఆమెను మరొక రకమైన ఇబ్బందికి గురిచేసింది. అయితే ఆ వ్యక్తి ఇచ్చిన ఆత్మవిశ్వాసం మనోధైర్యమే.. ఆమెని, ఆమె జీవితాన్ని నిలబెట్టింది.
మోహన్ : కొంతమంది వాళ్ళ ఆత్మకథల్ని రాస్తే, తాను మాత్రం తన ఆత్మ వ్యథని రాస్తున్నానంటాడు. జీతంలోనే జీవితాన్ని సర్దుకుందాం అంటే డబ్బు అవినీతి మార్గంలోనైనా సంపాదించమని వేధించే భార్య అతడి జీవిత భాగస్వామి కావడం అతడి వ్యథార్ధ జీవితానికి కారణం. ఆ క్రమంలో అతడు లంచగొండి, తాగుబోతు, వ్యభిచారి అవుతాడు. అయితే అతడిలో మంచితనం చచ్చిపోలేదు. ఒక రాత్రి అతడి అవసరపు కళ్ళకి, పవిత్ర ఒళ్ళు కట్టిపడేస్తే నచ్చడమే కాదు పడి చచ్చేంతగా అతనిలోని కవిని తట్టి లేపింది. 'నువ్వు చేసే తప్పుల్లో నిజాయితీ ఉంది, నేను చేసే తప్పుల్లో అవినీతి ఉంద'ని ఒప్పుకునే నీతి ఉన్నవాడు.
వంశీ : మోహన్ ప్రసాద్ పక్కవాటాలోకి అంతకు ముందు రోజే అద్దెకు దిగినందువల్ల పక్కింట్లో ఎవరుంటారో తెలియదు అతనికి. అర్ధరాత్రి ఒక పడుచు పిల్ల ... పక్కింటి వ్యక్తి మరణించాడు, సహాయం కావాలంటుంటే ఎలా అర్థం చేసుకోవాలో తెలియని కన్ఫ్యూజన్లో ఉంటాడు. శవాన్ని బయట పడుకో పెట్టాలన్నా, మరో మనిషి తోడు కావాలి. మరో పొరుగు వారి సహాయం కోరదామంటే.. అతడు తాగుబోతు. డైరీలో ఫోన్ నెంబర్ వెతికి మోహన్ ప్రసాద్ భార్య.. రాధికకు ఫోన్ చేస్తే ఆమె సంధించిన ప్రశ్నలు మరింత అయోమయంలో పడేస్తాయి వంశీని. భర్త చనిపోయాడు అంటే యాక్సిడెంటా? కాళ్లు చేతులు విరిగాయా? వచ్చి సేవలు చేయాలా? అని అడుగుతుంది. మూడు ముళ్ళ తాడు తెంచుకోవడానికి 300 కిలోమీటర్ల రావాలా? అని అడుగుతుంటే, వారి వివాహ బంధాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ?
హరి : నాటికలో దుష్ట పాత్ర అయినా నాటికకు కథానాయకుడు ఇతడే. మనుషులు తమ స్వార్ధం కోసం ఎంతకు దిగజారి తమ అవసరాల పూర్తి కోసం ఎంత అమానవీయంగా వ్యవహరించగలరో, అసహాయ అబలల పట్ల ఎంత కర్కశత్వాన్ని చూపగలరో, అంతటి విలనిజంకి అవకాశం ఉన్న పాత్ర. పవిత్ర పక్కన వంశీని చూసి- 'శవం కట్టెలో కాలకముందే ఇంకో కస్టమర్‌కి కనెక్ట్ అయిపోయావా? అయినా ఆలికి లేని బాధ వెలయాలికి ఎందుకో? అంటాడు వ్యంగ్యంగా. మీకు సెటిల్మెంట్లే కాదు, సెంటిమెంట్లు కూడా ఉంటాయా? .. మోహన్ స్థానం ఖాళీ అయిందిగా, ఆ ప్లేస్‌లోకి నన్ను తీసుకో...' అంటూ వికారంగా కామెంట్ చేస్తాడు. పవిత్ర క్యారెక్టర్ ఏమిటో తెలుసుకున్న తర్వాత.. తన ప్రవర్తనకు క్షమాపణలు కోరతాడు.
సిద్ధు : తల్లి మాటల వల్ల తండ్రిపై విపరీతమైన ద్వేషం పెంచుకుంటాడు. తండ్రి చనిపోయాడన్న విషయం తెలుసుకుని ఇంటి పత్రాల కోసం వస్తాడు. 'తండ్రి చనిపోతే ఏ కొడుకు అయినా కన్నీటితో సాగనంపుతాడు కానీ నేను కడుపు మంటతో సాగనంపుతున్నాను.' అంటాడు. 'నాన్నను వదులుకున్నానని ఆస్తిని వదిలేస్తామనుకున్నావా?' అంటూ పవిత్రపై భౌతిక దాడి చేస్తాడు. పవిత్ర ఇచ్చిన తండ్రి డైరీ చదవడంతో సిద్ధూలో కూడా తీవ్రమైన మార్పు వస్తుంది. 'నాన్నా.. అమ్మ మాటలు నమ్మి మిమ్మల్ని దూరం చేసుకున్నాను. నిజం తెలియక నిందించాను. నన్ను క్షమించండి నాన్న' అంటూ కన్నీటి పర్యంతమవుతాడు. 'నాన్న చనిపోలేదు.. డబ్బు చుట్టూ తిరిగే మా ఆర్థిక సంబంధాలు నాన్నని చావు దెబ్బ కొట్టాయి. చివరగా మనిషిని బట్టి, చేసే వృత్తిని బట్టి గుణాన్ని అంచనా వేస్తే అది పొరపాటు అవుతుంది.' అంటూ పవిత్ర పాదాలపై పడి క్షమాప్రార్ధన చేస్తాడు.
చక్కని కథకు, అతి చక్కని నాటకీకరణ చేసి మనసును తాకే సంభాషణలు పరమాత్ముని శివరామ సమకూర్చగా, మంచాల రమేష్, హరి పాత్ర ధరించి దర్శక బాధ్యతలు కూడా చేపట్టాడు. పాత్రధారులు అందరూ పాత్రల స్వరూప స్వభావాలకు తమ నటనా ప్రతిభతో నాటికను బాగా ఎలివేట్ చేసి ప్రదర్శించినందున పలు ప్రతిష్టాత్మక పరిషత్తులలో, ఇతర ఆహ్వానిత ప్రదేశాల్లో, పలు ఉత్తమ బహుమతులు అందుకున్నారు. పవిత్రగా గుడివాడ లహరి, వంశీగా కొత్తకొండ సత్యనారాయణ, సిద్ధార్థగా శివరామిరెడ్డి, మోహన్ ప్రసాద్‌గా టీవీ సినిమా నటుడు విజరు కుమార్- పాత్రలకు జీవం పోశారు. సంగీతం సురభి నాగరాజు, ఆహార్యం రంగాలంకరణ- నాగు.
రంగస్థలం నాటకం ప్రేక్షకులను ఆలోచనకు గురిచేసి, చైతన్యం నింపి సమాజ దశా దిశ మార్చడంతో పాటు వ్యక్తులలో మానవీయ స్పందన ఆలోచన, సమాజాన్ని చూసే దృష్టి కోణంలో మార్పును తీసుకురాగల నాటకమే ఉత్తమ నాటకంగా చెప్పుకోవచ్చు. 'చీకటి పువ్వు' అలా, చీకటి నుంచి వెలుతురు వైపు నడిపించే నాటిక.
- మల్లేశ్వరరావు ఆకుల
79818 72655