
ఒక పక్క క్రీడరంగంలో దేశం ముందుందని చెప్పుకుంటున్నా ఇంకా మారుమూల పాఠశాల్లో పిల్లలకు క్రీడరంగం పట్ల పెద్ద అవగాహన లేదు. తమకు తెలిసిన చిన్న చిన్న ఆటలు ఆడుకుంటారు. దీన్ని గ్రహించిన ప్రియాల్ వారికి ఆటల్లో మార్గనిర్దేశిగా మారారు. క్రీడా విద్య ద్వారా నిరుపేద పిల్లలకు సాధికారత కల్పిస్తున్నారు. ఫౌండేషన్ స్థాపించి క్రీడల పట్ల అవగాహన కల్పిస్తూ ఆటలను నేర్పిస్తున్నారు.
మహారాష్ట్రకు చెందిన ప్రియాల్ కేని 13 ఏళ్ల వయస్సులో రైఫిల్ షూటర్ క్రీడా రంగంలోకి ప్రవేశించింది. అయితే అప్పటివరకూ ఆమెకు ఆ ఆట ఒకటి ఉంటుందని తెలియదు. దాంతో ఈ ఆటల పట్ల చిన్నతనం నుంచే ఎవరైనా అవగాహన కల్పిస్తే బాగుండేదనకున్నారు. ముంబయిలో ఓ అకాడమిలో చేరారు. రోజులో నలుగైదు గంటల పాటు సాధన చేసేవారు. చదువుకుంటూనే పట్టుదలతో మండే వేడిలో సైతం 6.5 కిలోల రైఫిల్‌ను పట్టుకుని ఆటను నేర్చుకున్నారు. జర్మనీలో జరిగిన తన తొలి అంతర్జాతీయ షూటింగ్ పోటీలో పాల్గొన్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 16 ఏళ్ల వయస్సులో లైసెన్స్ పొందిన తుపాకీతో ప్రయాణించడానికి వీల్లేదంటూ అధికారులు అడ్డు చెప్పారు. దాంతో ఆమె రైఫిల్ ఆయుధాన్ని మరొకరి చేత పంపేందుకు రాష్ట్ర సంఘం, జాతీయ సంస్థ, జర్మన్ అధికారుల అనుమతులు తీసుకోవలసి వచ్చింది. పోటీ పడ్డ ప్రదేశం పూర్తిగా భిన్నమైనది. మంచు, చలి వల్ల షూట్ చేసేందుకు ఆమె చేతులు సహకరించలేదు. అయినా పోటీలో పాల్గొని మెడల్స్ సాధించారు. మొదటి పోటీ ఈవెంట్ నుండి, ప్రియాల్ అనేక అంతర్జాతీయ టోర్నమెంట్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల్లో, ఛాంపియన్‌షిప్‌లో పోటీ పడి ఇప్పటివరకు 117 పతకాలను గెలుచుకుంది.
వాలంటీర్‌గా సేవా కార్యక్రమాల్లో
ప్రియాల్ క్రీడల్లోకి రాకముందే, వాలంటీర్‌గా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేది. ఆమె సిఎ చదువు పూర్తి చేసిన తర్వాత స్నేహితుడు సార్థక్‌తో కలిసి, 2019లో ప్లే అండ్ షైన్ ఫౌండేషన్‌ను ప్రారంభించింది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల్లో పిల్లలకు ఫౌండేషన్ ద్వారా పలు క్రీడల పట్ల అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. ఎటువంటి లాభాపేక్ష లేకుండా క్రీడా సంస్కృతిని నిర్మించాలనకున్నారు ప్రియాల్. ఫౌండేషన్ స్థాపించక ముందే పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. కొన్ని పాఠశాలల్లో క్రీడా పాఠాలు చెప్పడానికి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు లేవని తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడినప్పుడు క్రీడల పట్ల వారికి మంచి ఆసక్తి ఉన్నట్లు గ్రహించారు. పిల్లలకు ఏ ఆట అంటే ఇష్టమో కనుక్కొని దానికి తగ్గట్లుగా బృందంలో క్రీడాకారుల చేత వారంలో ఒక రోజు ఆయా పాఠశాలలకు వెళ్లి క్రీడలు నేర్పిస్తున్నారు. అథ్లెటిక్స్, చెస్, ఫుడ్‌బాల్, క్రికెట్ వంటి 15 రకాల ఆటలను నేర్పిస్తున్నారు. రెండేళ్ల క్రితం ప్లే అండ్ షైన్ ఫౌండేషన్ టీచ్ ఫర్ ఇండియా గ్రూపుతో కలిసి స్పోర్ట్స్ లిటరసీ, స్పోర్ట్స్ మెంటర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా పిల్లలకు మనస్తత్వవేత్త, ఫిజియోథెరపిస్టులు పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చేవారు. దీంతో పేద పిల్లల శారీరక, మానసిక వికాసానికి దోహదపడేలా ప్రియాల్ కృషిచేశారు. లాక్డౌన్ సమయంలో కూడా ఎక్కువ మంది విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా క్రీడా అవగాహన కల్పించారు. సిఎ పూర్తి చేసిన ప్రియాల్ ఓ ప్రయివేటు కంపెనీల ఉద్యోగిని. అయినా క్రీడారంగంలో పేద విద్యార్థులు రాణించాలన్న సంకల్పంతో ఫౌండేషన్ నడుపుతున్నారు. 2023 చివరి నాటికి ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది విద్యార్థులను తమ సేవలను చేరువ చేయాలన్న దిశగా ప్రియాల్, ఆమె బృందం కృషి చేస్తుంది.