
-నలుగురికి గాయాలు
-భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే కారణం!
ప్రజాశక్తి- అనకాపల్లి ప్రతినిధి:అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని జిఎంఎఫ్‌సి (మందుల పరిశ్రమ) ల్యాబ్‌లో మంగళవారం ఉదయం రియాక్టర్ పేలి పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం గెడ్డలుప్పికి చెందిన కెమిస్టు చొల్లంగి రామారావు (30) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో నలుగురు కార్మికులు గాయపడ్డారు. రియాక్టర్ పేలి మంటలు వ్యాపించడంతో రామారావు శరీరం పూర్తిగా కాలిపోయింది. పోస్టుమార్టం నిమిత్తం ఆయన మృతదేహాన్ని అనకాపల్లిలోని ఎన్‌టిఆర్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన కార్మికుల్లో యానాంకు చెందిన కానూరి కృష్ణంరాజును ప్రాథమిక చిక్సిత చేసి కంపెనీలో ఉంచారు. జార్ఖండ్‌కు చెందిన ప్రభాకర్ ఝా, భీమవరానికి చెందిన రవివర్మ, విశాఖ నగరంలోని దువ్వాడకు చెందిన వి.సుబ్బరాజులను అనకాపల్లిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. రియాక్టర్ పేలిన భవనం ధ్వంసమైంది. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాద కారణాలపై ఫ్యాక్టరీ తనిఖీ అధికారులు పరిశీలిస్తున్నారని అనకాపల్లి ఆర్‌డిఒ చిన్నికృష్ణ విలేకరులకు తెలిపారు. డిఎస్‌పి శ్రీనివాసరావు మాట్లాడుతూ గాయపడిన వారికి ప్రాణాపాయ పరిస్థితిలేదని వైద్యులు తెలిపినట్టు చెప్పారు. ఎలక్ట్రికల్ కండక్టివ్ పైపు బదులు ప్లాస్టిక్ పైపు ద్వారా మిథనాల్‌ను రియార్టర్‌లోకి పంపించడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు ప్రాథమిక విచారణలో గుర్తించినట్టు డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్ సురేష్ 'ప్రజాశక్తి'కి తెలిపారు. వారంలో విచారణ పూర్తి చేసి ప్రమాదానికి యాజమాన్య లోపాలు రుజువైనట్లయితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మృతుని కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని సిఐటియు ధర్నా
రామారావు కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం యాజమాన్యం చెల్లించాలని సిఐటియు అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఆర్.రాము డిమాండ్ చేశారు. సిఐటియు అచ్యుతాపురం మండలం కార్యదర్శి కె.సోమినాయుడు, కార్మికులతో కలిసి కంపెనీ గేట్ ముందు నిర్వహించిన ఆందోళనలో వారు మాట్లాడారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో కంపెనీల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. యాజమాన్యంపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, భద్రతపై సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
బాధితులను పరామర్శ
ప్రమాదంలో గాయపడి అనకాపల్లిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్.శంకరరావు, కోశాధికారి వివి.శ్రీనివాసరావు, ఎపి కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎ.బాలకృష్ణ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.

