Mar 17,2023 08:27

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో : రూబీ హౌటల్‌ అగ్నిప్రమాదం ఘటన మరువక ముందే సికింద్రాబాద్‌లో మరో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతులు ప్రమీల, వెన్నెల, శ్రావణి, త్రివేణి, శివ, ప్రశాంత్‌గా గుర్తించారు. మఅతులంతా 25 ఏళ్ల వయసులోపువారిగా తెలుస్తోంది.

నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భవనంలోని 5,6,7,8 వ అంతస్తుల్లో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో వ్యాపారులు, సిబ్బంది, కొనుగోలుదారులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. నిమిషాల వ్యవధిలోనే దట్టమైన పొగ భవనం మొత్తం అలుముకోవడంతో ఆయా అంతస్తుల్లో చిక్కుకున్నవారు హాహాకారాలు చేశారు. కొంతమంది మెట్ల మార్గంలో భవనంపైకి చేరుకొని రక్షించండంటూ... కేకలు వేశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. కాంప్లెక్స్‌లో చిక్కుకున్న 13 మందిని భారీ క్రేన్ల సాయంతో కిందకు తీసుకొచ్చారు. మంటలను అదుపుచేసేందుకు ఆరు ఫైరింజన్ల సహాయంతో అర్ధరాత్రి వరకు రెస్క్యూ సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. మంటల తీవ్రతకు కాంప్లెక్స్‌ పైకి చేరుకున్న పలువురు బాధితులు.. తమను రక్షించాలంటూ సెల్‌ఫోన్‌ లైట్లతో సంకేతాలిచ్చారు. వారిని కూడా రెస్క్యూ టీం కాపాడింది. స్థానిక మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉందని డిసిపి చందనాదీప్తీ తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.