Nov 20,2022 20:09

వినోదం.. విజ్ఞానం.. వికాసం.. విప్లవం వంటి సగటు మనిషి ఆలోచనలకు చైతన్యబీజాలు వేసిన చరిత్ర మన తెలుగు సినిమాది. కాయకష్టం చేసుకునే బడుగు జీవుల నుండి కారులో షికారు చేసే కుర్రకారు వరకు కాసింత వెసులుబాటు ఇచ్చిన ఏకైక మాధ్యమంగా వర్థిల్లింది. పల్లె నుంచి పట్నం వరకు అందరినీ ఒక్కతాటిపై నడిపించిన చరిత్ర గలది. పోరాటాలకు, ప్రతిఘటనలకు నిలువెత్తు ఆలంబనగా నిలిచిన గొప్ప దూరదృష్టి గలది. ఇంతటి ఘన చరిత్రలో ఎందరో మహానుభావులు.. తమకంటూ ప్రత్యేక ముద్రవేసుకున్న ఆ తరం నటీనటులంతా ఇప్పుడు మనమధ్య లేకపోయినా చిత్రరంగానికి వారు అందించిన సేవలు అజరామరం.

  • చరిత్రకు శ్రీకారం..

తొలినాళ్లల్లో సినిమాల్లో నటించేవారు, తీసేవారు, నిర్మించేవారంతా రంగస్థల కళాకారులే ఉండేవారు. సినిమా అంటే వినోదం మాత్రమే కాదు విప్లవం సృష్టించేదిగా కూడా ఉండగలదని ఆ కళాకారులు నిరూపించారు. పురాణ గాథలే ఇతివృత్తాలుగా వస్తున్న ఒరవడికి భిన్నంగా గూడవల్లి రామబ్రహ్మం 'మాలపల్లి' చిత్రం కొత్త ప్రభంజనం సృష్టించింది. జమిందారీ విధానాలను ఎదిరించడం, రైతు సమస్యలను ప్రజల ముందుంచడంలో అప్పటి చలనచిత్రాలు ముందువరుసలో నిలిచేవి. జమిందారీ విధానాన్ని వ్యతిరేకిస్తూ తెరకెక్కిన 'మాలపల్లి' చిత్రంపై అప్పట్లో నిషేధాజ్ఞలు కూడా అమలయ్యాయి. సంఘంలో జరిగే అనేక దురాచారాలపై తెరకెక్కిన ఆనాటి చిత్రాలు ప్రజా జీవనాలపై విశేష ప్రభావం చూపాయనడంలో సందేహం లేదు.

  • ప్రజానాట్యమండలి నుంచి...

నటనకు ప్రత్యేక శిక్షణా తరగతులేమీ లేని రోజులవి. రంగస్థలమే కళాకారుల పుట్టిల్లుగా వర్థిల్లుతున్న కాలం. తెలుగుతెరపై మెరిసిన ఆనాటి నటీనటులంతా రంగస్థల కళాకారులే. దర్శకుడు రాజారావు 'పుట్టిల్లు' చిత్రం ద్వారా ఎంతోమంది రంగస్థల కళాకారులను చిత్రసీమకు పరిచయం చేశారు. నాగేశ్వరరావు, కృష్ణ, ఎస్‌వి రంగారావు, అల్లు రామలింగయ్య, రాజనాల, ప్రభాకరరెడ్డి తదితరులు, దర్శకుల్లో ఆదుర్తిసుబ్బారావు, వేదాంతం రాఘవయ్య, తాతినేని ప్రకాశరావు, తాపీ చాణక్య, యోగానంద్‌ తదితరులంతా రంగస్థలం నుంచి వచ్చినవారే. ఎన్నో వైవిధ్యాలు, మరెన్నో ప్రయోగాలతో కళారంగానికి సేవచేసిన ఈ కళాకారులు తెలుగు సినిమా స్థాయిని పెంచడంలో అవిశ్రాంతంగా పాటుపడ్డారు. 1957లో విజయ సంస్థ వారు నిర్మించిన 'మాయా బజార్‌' చిత్రం ఓ దృశ్య కావ్యం. నటులే దర్శకులుగా, నిర్మాతలుగా మారిపోయి సినిమా తీసిన చరిత్ర ఉంది. ఎన్‌టిఆర్‌ స్వయంగా దర్శకత్వం వహించి మూడు పాత్రల్లో నటించిన 'దాన వీర శూర కర్ణ' అప్పట్లో పెద్ద సంచలనం. ఏకంగా తొమ్మిది పాత్రల్లో 'నవరాత్రి' సినిమాలో అక్కినేని నటించారు. జానపద చిత్రాల్లో తన మార్కు నటనకు కాంతారావు నిలిచిపోయేవారు. గంభీర స్వరంతో తెలుగు తెరకు నిండుతనం తెచ్చిన నటుల్లో ఎస్‌వి రంగారావుది అగ్రస్థానం. ఇంకా రాజబాబు, రేలంగి, రమణారెడ్డి, సూర్యకాంతం, గీతాంజలి, గిరిజ తదితరులు స్వచ్ఛమైన హాస్యానికి మారుపేరుగా నిలుస్తారు. మూడోతరం నటులుగా శోభన్‌బాబు, కృష్ణ, కృష్ణంరాజు తదితరులు సాంఘికచిత్రాలు, ప్రయోగాత్మక చిత్రాలతో పాటు కొత్త సాంకేతికతను చిత్రరంగానికి పరిచయం చేశారు.

  • నిబద్ధతతో..

అప్పటి నటులంతా కళారంగానికి సేవ అందించడంలో ఎంతో నియమ నిబద్ధతలతో వ్యవహరించేవారు. నిర్మాతలకు నష్టం వస్తుందంటే పారితోషికాలు తగ్గించుకోవడం, సినిమా ప్రచారంలో ముందుండి నడిపించడం, ముఖ్యంగా తక్కువ సమయంలో సినిమా పూర్తయ్యేలా చూడడంలో రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడేవారు. ఒక్కొక్క నటులు ఏడాదికి పదికి పైగా చిత్రాలు చేసేవారంటేనే ఎంతటి సమయపాలన పాటించేవారో అర్థమౌతుంది.
ఎన్‌టి రామారావు (400), నాగేశ్వరరావు (256), శోభనబాబు (300 పైగా), కృష్ణంరాజు (188), కృష్ణ (350 పైగా), ఎస్‌వి రంగారావు (దాదాపు 150), రాజబాబు (దాదాపు 100), అల్లు రామలింగయ్య (1000కి పైగా) ... ఇలా అప్పటి నటీనటుల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టులే కాక హీరోలు కూడా వందల్లో సినిమాలు చేసేవారు. కాని ఇప్పుడు వారి రెండోతరం, మూడోతరం వారసులుగా ఇండిస్టీలోకి వచ్చిన నటులెవ్వరూ వంద సినిమాలకు దరిదాపుల్లో కూడా ఉండడం లేదు.
ఈ తరం నటుల్లో చిరంజీవి మాత్రమే 150 చిత్రాల మార్కును అందుకున్నారు. కృష్ణ వారసుడిగా మహేష్‌, కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్‌, చిరంజీవి వారసులుగా పవన్‌ కళ్యాణ్‌, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, నాగేశ్వర రావు వారసులుగా నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌ తదితర ఈ తరం నటులు కనీసం 50 సినిమాల దరిదాపుల్లో కూడా లేరు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో.. వందల కోట్ల రూపాయల బడ్జెట్‌తో.. దేశవిదేశాల్లో చిత్ర నిర్మాణమే తెలుగు సినిమా చరిత్రగా ఇప్పటి తరం భావిస్తోంది. కానీ తెలుగు సినిమా గత చరిత్ర ఎన్నో ప్రయోగాలకు, సామాజిక ప్రయోజనాలకు వేదికగా నిలిచింది. ఆ వారసత్వం కొనసాగించదగింది.