Nov 29,2022 09:17
  • లోపభూయిష్టంగా వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష పథకం ఎల్‌పిఎంలు
  • ప్రభుత్వ, ప్రయివేటు భూములు ఒకే ఎల్‌పిఎం
  • భూ విస్తీర్ణంలోనూ వ్యత్యాసాలు
  • లబోదిబోమంటున్న రైతులు

ప్రజాశక్తి- కృష్ణా, శ్రీకాకుళం ప్రతినిధులు : - కృష్ణా జిల్లా పామర్రు మండలం కనుమూరులో పర్చూరి కృష్ణమూర్తికి 3 ఎకరాల 30 సెంట్లు భూమి ఉంది. రీ సర్వేలో మూడు సెంట్లలో వ్యత్యాసం చోటు చేసుకుంది. సెంటు రూ.27 వేలు చొప్పున మూడు సెంట్లకు మొత్తం రూ.81 వేల విలువైన స్థిరాస్తి కోల్పోవాల్సి వచ్చిందని ఆయన వాపోతున్నారు.

- కృష్ణా జిల్లా గుడివాడ రూరల్‌ మండలం బొమ్ములూరులో అట్లూరి శేషగిరి కుటుంబానికి 5.91 ఎకరాల్లో కొంత వ్యవసాయ భూమి, మరికొంత ఆక్వా చెరువుగా ఉంది. రీ సర్వేలో 70 సెంట్లు కోల్పోయినట్లు బాధితుడు వాపోతున్నాడు. మళ్లీ సర్వే చేసి లోపాలు సవరించాలని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు - భూ రక్ష పథకం కింద చేపట్టిన సర్వే తప్పుల తడకగా సాగుతోంది. ల్యాండ్‌ పార్శిల్‌ మ్యాప్‌లలో (ఎల్‌పిఎం) తీవ్ర లోపాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ, ప్రయివేటు భూములు ఒకే ఎల్‌పిఎంలో నమోదయ్యాయి. మరోపక్క రీ సర్వే చేసే క్రమంలో భూ విస్తీర్ణంలో వస్తున్న వ్యత్యాసాలు భూ యజమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మొదటి, రెండో దశల్లో కృష్ణా జిల్లాలోని వంద గ్రామాలకు సంబంధించిన 77,172 ఎకరాల 80 సెంట్లు విస్తీర్ణంలో భూముల రీ సర్వే పూర్తయినట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది.

ఈ గ్రామాల్లో సర్వే సంఖ్యలను మార్చి 52,092 ల్యాండ్‌ పార్శిల్‌ మ్యాప్‌ (ఎల్‌పిఎం)లు కేటాయించారు. ప్రభుత్వ, ప్రయివేటు భూములకు ఒకే ఎల్‌పిఎం ఇచ్చారు. దీంతో, ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్లు జరిగిపోయే ప్రమాదం ఉందని అధికార యంత్రాంగం ఆందోళన చెందుతోంది. వివిధ రిజిస్ట్రేషన్‌ విలువలున్న భూములను ఎల్‌పిఎంలో కలిపివేశారు. భూముల రిజిస్ట్రేషన్ల విలువలు నిర్థారించడం సంక్లిష్టంగా మారింది. భూముల విలువల ఆధారంగానే నిర్దేశించిన ఫీజులు చెల్లించి రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి వీలవుతుంది.
 

                                                              సర్వే సంఖ్య ఆధారంగానే రిజిస్ట్రేషన్లు

రీ సర్వే పూర్తయిందని 13 నోటిఫికేషన్‌ ఇచ్చిన గ్రామాల్లో పూర్వపు సర్వే సంఖ్యలను పక్కనపెట్టి ఎల్‌పిఎం ఆధారంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిర్వహించాలని రిజిస్ట్రేషన్‌ శాఖ రాష్ట్ర అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సర్వే పూర్తయిన వంద గ్రామాలకుగానూ 51 గ్రామాల్లో ఎల్‌పిఎం ఆధారంగా రిజిస్ట్రేషన్లు నిర్వహించేందుకు జిల్లా అధికారులు సన్నద్ధమయ్యారు. ఎల్‌పిఎంలలో ఉన్న లోపాలను గుర్తించి విరమించుకున్నారు. వీటిని సవరించే పనిలో ఉన్నారు. రీ సర్వేకు ముందు ఫూరిఫికేషన్‌ ఆఫ్‌ ల్యాండ్‌ రికార్డ్సు (రెవెన్యూ రికార్డుల్లో లోపాలు సవరించడం) చేయాలి. ఆ తర్వాత గ్రామ సరిహద్దులను నిర్ణయించి భూ యజమానులకు నోటీసులు ఇవ్వాలి. చాలా గ్రామాల్లో నోటీసులు ఇవ్వకుండానే రీ సర్వే పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో సమస్యలు అధికంగా చోటు చేసుకుంటున్నాయి.
 

                                                                        శ్రీకాకుళం జిల్లాలోనూ...

శ్రీకాకుళం జిల్లా కవిటి మండల కేంద్రానికి చెందిన బెందాళం వేణుకు పుటియాదల రెవెన్యూ పరిధిలో 52 సెంట్లు ఉంటే సర్వేలో 48 సెంట్లు ఉన్నట్లుగా తేల్చారు. ఆన్‌లైన్‌లో 44 సెంట్లు నమోదు చేశారు. వారసత్వంగా తమ అనుభవంలో ఉన్న భూమి వేరే వ్యక్తి పేరు మీద ఉందని, ఆ వ్యక్తిని తీసుకురమ్మని సర్వే సిబ్బంది చెప్తున్నారని, తాను ఎక్కడి నుంచి తీసుకురావాలని ఆయన ఆవేదన చెందుతున్నాడు. సర్వే చేస్తున్నప్పుడు చుట్టుపక్కన ఉన్న రైతులను పిలిచి వారి అభిప్రాయాలు, అభ్యంతరాలు తీసుకోకుండా సర్వే సాగిస్తున్నారని ఆయన వాపోయారు. బూర్జ మండలం మదనాపురానికి చెందిన జి.ఆదినారాయణకు ఎకరా 86 సెంట్ల భూమి ఉంది. తరతరాలుగా అందులోనే వ్యవసాయం చేస్తున్నారు. సర్వే చేసిన తర్వాత 86 సెంట్లే ఉందని అధికారులు నోటీసు ఇవ్వడంతో ఆయన షాక్‌ తిన్నారు. పలుమార్లు తహశీల్దార్‌ కార్యాలయానికి వెళ్లినా ఆ సమస్య పరిష్కారం కాలేదు.