Aug 19,2022 07:34

అందమైన డిజైన్లు, రంగురంగుల దుస్తులు ధరించిన వారంతా ర్యాంప్‌పై అలా నడుచుకుంటూ వెళుతుంటే ప్రేక్షకులు మైమరిచిపోయారు. రకరకాల సంజ్ఞలు చేస్తూ వీక్షకులకు అభివందనం చేస్తున్న వారిని చూసి గర్వంతో ఉప్పొంగని హృదయం లేదక్కడ. అంత స్ఫూర్తివంతంగా సాగిందా ఫ్యాషన్‌ షో. 'తమన్నా' స్వచ్ఛంద సంస్థ, ఫ్యాషన్‌ డిజైన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌డిసిఐ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఫ్యాషన్‌ షో అంతగా ఆకర్షించడంలో ఓ 'ప్రత్యేక' కారణముంది. వారంతా 'ప్రత్యేక' అవసరాలు గల వారు.

fashion 1


ప్రతి ఏడాది జరిగే ఈ ఫ్యాషన్‌ షో గత శుక్రవారం 'ఫ్యాషన్‌ బియాండ్‌ బౌండరీస్‌' పేరుతో న్యూఢిల్లీ హయత్‌ రీజెన్సీలో నిర్వహించారు. ఫ్యాషన్‌ ప్రపంచంలో అతిరధ మహారధులందరూ ఈ షోకు విచ్చేశారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించిన 'తమన్నా' ఫౌండేషన్‌ స్థాపన వెనుక ఓ స్ఫూర్తివంతగాథ ఉంది.

fashion 2


'తమన్నా ఫౌండేషన్‌' ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థ. సరిగ్గా నడవలేని, మాట్లాడలేని ఆ పిల్లలతో ఏకంగా ఫ్యాషన్‌ షో నడిపిస్తున్న నిర్వాహకురాలు డాక్టర్‌ షయానా చోనా ఉన్నత విద్యావంతురాలు. ఢిల్లీ పబ్లిక్‌ స్కూలు ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తూనే తమన్నా బాధ్యతలు సమర్థవంతంగా పోషించారు. 'ఈ పిల్లలు మేధోపరమైన, శారీరక లోపాలతో పుట్టివుండవచ్చు. కాని ఈ షో ద్వారా మేము కూడా మీలాంటి వారిమే.. మనమంతా ఒక్కటే అన్న ప్రచారం చేయడం నాకు చాలా సంతోషమేస్తుంది. అలాగే మనం ఏదైనా సాధించవచ్చు అనే లక్ష్యం ప్రతిఒక్కరిలో కలిగేలా ఈ పిల్లలు జన్మించారని నేను భావిస్తాను' అంటారు ఆమె.

fashion 3


'తమన్నా' గురించి చెబుతూ 46 ఏళ్ల క్రితం 'సెరిబ్రల్‌ పాల్సీ' అంటే ఏమిటో అర్థంకాని పరిస్థితుల్లో తమన్నా పుట్టింది. డాక్టర్లు ఆశలు వదులుకోమన్నారు. కాని స్వచ్ఛమైన తమన్నా నవ్వు నన్ను ఏదైనా సాధించవచ్చు అనేలా సంకల్పించింది' అంటారు షయానా. 'జీవితం అందంగా గడిచిపోతున్న రోజులవి. మూడేళ్ల కొడుకుతో రెండో బిడ్డ ఆడపిల్ల పుట్టాలని కలలుగంటున్న వేళ తమన్నాను చేతుల్లోకి తీసుకున్నప్పుడు చాలా విచిత్రంగా అనిపించింది. కాళ్లు, చేతులు కుంగిపోయినట్లుగా, రెండువైపులా సాగిన తలతో విచిత్రమైన ఆకారం గల కళ్లతో ఉన్న తమన్నా పాలకు ఏడుస్తున్నా ఆకలి తీర్చలేని స్థితిలో ఉండిపోయాను. ఎన్నో హాస్పటళ్లు తిరిగాం. ప్రయోజనం లేదు. ఎవరికైనా ఇచ్చేయమని ఎంతోమంది సలహా ఇచ్చేవారు. కాని నాకు, నా భర్తకు అది ఇష్టం లేదు. నా వృత్తి, కుటుంబం, సమాజం ముందు నా మాతృత్వం జయించింది. నేను ఈ ప్రయాణం చేయడానికి నన్ను ఉసిగొల్పింది నా తమన్నా నవ్వే. ఆ నవ్వులో 'అమ్మా ఏడ్వకు. నాకంటూ ఒకరోజు వస్తుంది. ఆరోజు నేను నా తలను నేరుగా నిలబెడతాను. అటూఇటూ తిప్పుతాను. నాకు నేనే కూర్చోంటాను. నడుస్తాను. డ్యాన్స్‌ చేస్తాను. చదువుకుంటాను. నా గురించి నువ్వెలా కలలుగన్నావో అలాగే నేను మారతాను' అన్నట్లు ఉండేది అంటారు షయానా. అలా మొదలైన ఆమె ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు.
9 ఏళ్ల వరకు ఒక్క మాట మాట్లాడని తమన్నాకు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌, ఫిజియోథెరపీ, స్పీచ్‌ థెరపీ, ఆక్యుపేషనల్‌ థెరపీ, గ్రూమింగ్‌, సోషల్‌ స్కిల్స్‌లో శిక్షణ ఇప్పించారు. 'కొన్ని రోజులు విజయం సాధించాం, కొన్ని రోజులు విఫలమయ్యాం, కొన్ని రోజులు కలిసి ఏడ్చాం, మరి కొన్నింటిలో నవ్వుకున్నాం. ఇప్పుడు తనలాంటి ఎంతోమందికి గొప్ప స్ఫూర్తినిచ్చే స్థాయికి తమన్నా ఎదిగారు. 'నేను ఈదగలను, డ్యాన్స్‌ చేయగలను. సాధారణ మోడల్‌కి తీసిపోని విధంగా అన్ని పోటీల్లో పాల్గొనగలను. ఫ్యాషన్‌ షోలో నేను నడిచినట్లుగా ఏ మోడల్‌ నడవలేరు. ఈరోజు నన్ను చూసి నా తల్లిదండ్రులు ఎంతో గర్వపడుతున్నారు' అంటున్న తమన్నా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నడిచే ప్రత్యేక అవసరాలు గల పిల్లల స్కూల్లో నర్సరీ టీచర్‌గా ఉన్నారు.
ఫౌండేషన్‌ రూపకల్పన
1984లో తమన్నా ఫౌండేషన్‌ ప్రారంభమైంది. ప్రత్యేక అవసరాలు గల పిల్లల ఆలనాపాలనా చూసుకోవడంలో షయనా బృందం అప్పటి నుంచి చేస్తున్న కృషి ఎంతో గొప్పది. నేషనల్‌ ట్రస్ట్‌గా దేశవ్యాప్త గుర్తింపుపొందిన తమన్నాకు ఐక్యరాజ్యసమితి అభినందనలు తోడయ్యాయి. పిల్లలకు విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, జీవన ప్రవృత్తులు నేర్పించడంలో సమాజంలో గౌరవప్రదమైన స్థానం కల్పించడంలో సంస్థ గొప్ప కృషి చేస్తోంది.
'వైకల్యం వ్యాధి కాదు, వికలాంగులు మీలాంటివారే.. నాలాంటివారే.. వారిలో ఎన్నో భావోద్వేగాలు దాగివుంటాయి' అంటున్న షయానా విద్యావేత్తగా, సామాజిక కార్యకర్తగా విశేష సేవలందించారు. ఆమె సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్‌ బిరుదులతో సత్కరించింది.