Sep 23,2022 07:54

- పలువురికి గాయాలు - క్రికెట్‌ అభిమానులపై లాఠీచార్జి
ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో :
హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సిఎ) సమన్వయలోపం క్రికెట్‌ అభిమానులకు శాపంలా మారింది. టికెట్ల విక్రయం విషయంలో ముందస్తు అంచనాలేకుండా అనాలోచితంగా హెచ్‌సిఎ వ్యవహరిండంతో జింఖానా మైదానంలో తొక్కిసలాట జరిగింది. పలువురు మహిళలు, యువకులు గాయపడ్డారు. సకాలంలో పోలీసులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈనెల 25న ఉప్పల్‌ స్టేడియంలో జరిగే క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్ల విక్రయాన్ని కేవలం రెండు రోజుల ముందే హెచ్‌సిఎ ప్రారంభించింది. టికెట్ల కోసం ఎదురుచూస్తున్న క్రికెట్‌ అభిమానులు గురువారం తెల్లవారుజాము మూడు గంటలకే జింఖానా మైదానానికి చేరుకున్నారు. హెచ్‌సిఎ కార్యాలయం గేటు ముందు క్యూలైన్లలో బారులు తీరారు. ఉదయం 10గంటలకు వేల సంఖ్యలో అభిమానులు అక్కడికి రావడంతో జింఖానా పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా, పోలీసుల సహకారం లేకుండా 10.30గంటల సమయంలో హెచ్‌సిఎ అధికారులు గేట్లు తెరవడంతో ఒక్కసారిగా కౌంటర్ల వైపు అభిమానులు పరుగులు తీశారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. పలువురు మహిళలు, యువకులు కిందపడిపోయారు. అతికష్టంమీద వారిని పోలీసులు బయటకు తీసుకొచ్చారు. గాయపడిన పలువురిని యశోద ఆస్పత్రికి తరలించారు. పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు లాఠీచార్జి కూడా చేయాల్సివచ్చింది.
హెచ్‌సిఎ సమన్వయ లోపం : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
జింఖానా గ్రౌండ్‌ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. హెచ్‌సిఎ అధ్యక్షులు, రాచకొండ సిపి, ఇతర అధికారులతో క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సమావేశమయ్యారు. హైదరాబాద్‌ ప్రతిష్ట దెబ్బతీయాలనుకుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టంచేశారు. టిక్కెట్లు బ్లాక్‌లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జింఖానా ఘటనలో పోలీసుల వైఫల్యం లేదని చెప్పారు. హెచ్‌సిఎ సమన్వయ లోపం వల్లే ఘటన జరిగిందన్నారు.
క్రికెట్‌ నిర్వహణ అంత తేలికకాదు : అజారుద్దీన్‌
టిక్కెట్ల విక్రయం సందర్భంగా జరిగిన ఉద్రిక్త, పలువురు గాయపడటం దురదృష్టకరమని అన్నారు. మంత్రితో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహణ కూర్చొని మాట్లాడుకునేంత తేలికైన అంశం కాదని, జింఖానా ఘటనలో తమ తప్పు ఏమీ లేదని చెప్పారు. తెలంగాణ నంబర్‌వన్‌ రాష్ట్రం అని, మరింత ఖ్యాతి వచ్చేలా హెచ్‌సిఎ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. బాధితులకు హెచ్‌సిఎ అండగా ఉంటుందన్నారు. కాగా, ఆఫ్‌లైన్‌ టికెట్ల విక్రయాలు పూర్తయ్యాయని, ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయాలను గురువారం రాత్రి ఏడు గంటలకు ప్రారంభించినట్లు హెచ్‌సిఎ ప్రకటించింది.