
ఆరున్నరేళ్ల క్రితం నవంబర్ 8వ తేదీ సాయంత్రం నాటకీయంగా టీవీ తెర మీద కనిపించిన ప్రధాని నరేంద్ర మోడీ అప్పటి 1000, 500 రూపాయల నోట్లను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాని తీసుకున్న ఆ బాధ్యతారహిత, మూర్ఖపు నిర్ణయం వల్ల ఎంత భయంకరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయో తలచుకుంటేనే నేటికీ ప్రజలు వణికిపోతున్నారు.
అప్పట్లో చలామణిలో ఉన్న మొత్తం నగదులో దాదాపు 90 శాతం 500, 1000 రూపాయల నోట్లే. ప్రధానమంత్రి చర్య ఫలితంగా మార్కెట్ నుండి భారీ మొత్తంలో నగదు మాయమైంది. నగదు కొరత కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ నిలిచిపోయింది. అంతేగాక ప్రజల రోజువారీ జీవితం స్తంభించింది. నోట్ల రద్దు తర్వాత వెంటనే...నరేంద్ర మోడీ కలలుగన్న 2000 రూపాయల నోటు మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ నోట్ల రద్దుతో దేశం నుంచి నల్లధనం నిర్మూలించ బడుతుందని, నకిలీ ధనం సరఫరాను అరికట్టడం ద్వారా ఉగ్రవాదుల వెన్ను విరిచేస్తామని మోడీ తన టీవీ ప్రసంగంలో అన్నారు.
దీంతో అవినీతి కూడా అరికట్టవచ్చని అన్నారు. 2000 రూపాయల నోటును నేలమాళిగల్లో దాచిపెట్టినా పట్టుకునే సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేస్తామని సగర్వంగా చెప్పారు.
ఆరున్నరేళ్ల తర్వాత నరేంద్ర మోడీకి అత్యంత విశ్వాసపాత్రుడైన శక్తికాంత్ ఆధ్వర్యంలో 2000 రూపాయల నోటును రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది. మోడీ ఈసారి టీవీ తెరపై తన ముఖం చూపించలేదు. ఆర్‌బిఐ ప్రకటన సమయంలో ఆయన దేశంలో కూడా లేరు. జపాన్ లోని హిరోషిమా వెళ్లారు.
ఈ మోసపూరిత చర్యల వల్ల వందలాది మంది ప్రజలు అకాల మరణం చెందడమే కాకుండా, మొత్తం భారతీయ జనాభా జీవితాలు దుర్భరంగా మారాయి. ఎన్నో వ్యాపారాలు మూతబడ్డాయి. లక్షలాది మంది ప్రజలు జీవనోపాధిని కోల్పోయారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా ప్రజలు బాధలకు గురైన ఇటువంటి సందర్భం స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే లేదు. ఒక నియంత ఇష్టానుసారం చేసిన నిర్ణయం వల్ల భారత ప్రజలు ఈ విధంగా మూల్యం చెల్లించవలసి వచ్చింది.
నల్లధనం వ్యాపారులు నల్లధనం బస్తాల్లో దాచుకున్నారని, ఆ డబ్బంతా ఈ దెబ్బతో చిత్తు కాగితంగా మారుతుందనీ, మార్కెట్‌లో నకిలీ నోట్లు ఉండవనీ నోట్ల రద్దు సమయంలో చెప్పారు. ఉగ్రవాదులకు నగదు అందకుండా నిలిచిపోతుందన్నారు. తాము ప్రవేశపెడుతున్న 2000 రూపాయల నోటు నల్లధనంగా మారదన్నారు.
నిజానికి మోడీ కొత్త 2000 రూపాయల నోట్లను విడుదల చేసిన నెల రోజుల వ్యవధి లోనే వివిధ రాష్ట్రాల్లో, ముఖ్యంగా మోడీ రాష్ట్రమైన గుజరాత్‌లో నకిలీ 2000 నోట్లు బయటపడ్డాయి. మెల్లమెల్లగా దేశమంతటా నకిలీ 2000 రూపాయల నోట్లు విస్తరిస్తున్నాయి. అంతేకాకుండా ఎక్కడ చూసినా కోట్లాది రూపాయల 2000 రూపాయల నోట్లు బయటపడుతున్నాయి.
నల్లధనం నిల్వలో అత్యంత ఆకర్షణీయమైన, సౌకర్యవంతమైన నోటు 2000 రూపాయలు. ఈ పరిస్థితిలో ఆ నోటును రద్దు చేయాల్సి వచ్చింది. అయితే ఈ రద్దు ప్రకటన సమయంలో మోడీ ప్రజలకు కనిపించే ధైర్యం చేయలేకపోయారు. ఎందుకంటే ఆయన అనేక ప్రశ్నలను ఎదుర్కోవలసి వచ్చేది. ఇప్పటికైనా ఆయన సమాధానం చెప్పి తీరాల్సిందే. మోడీ ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక చర్యల్లో నోట్ల రద్దు ఒకటని ఇవాళ కాకపోతే రేపైనా అంగీకరించాల్సిందే.
/ 'గణశక్తి' సంపాదకీయం /