Sep 21,2022 10:29

సమాజహితం కోసం, గ్రామీణ పునర్నిర్మాణం కోసం నిస్వార్థంగా సేవచేసిన దార్శనీకుడు ఆయన. భవిష్యత్తరాల ప్రగతికోసం 1952లో అక్టోబరు 2న చిత్తూరుజిల్లా 'పుంగనూరు నియోజకవర్గ గ్రామీణ పునర్నిర్మాణ సంస్థ' స్థాపించారు. సంస్థ ఆధ్యర్వంలో ఆయన చేసిన సేవలు ఎనలేనివి. గ్రామాలను అభివృద్ధి పథంలో ఎలా నడిపించవచ్చో క్షేత్రస్థాయిలో నిరూపించిన గొప్ప సామాజికవేత్త. యువతకు గొప్ప మార్గనిర్దేశకుడుగా నిలిచిన ఆయన గుండాల రామకృష్ణయ్య.

A-tireless-farmer-in-village-reconstruction


     1929 చిత్తూరుజిల్లా వాయల్పాడు తాలూకా చిన్నగొట్టిగల్లు గ్రామంలో బడిపంతులు వెంకటస్వామి దంపతులకు రామకృష్ణయ్య జన్మించారు. చదువులో ఎప్పుడూ చురుకుగా వుండేవారు. కాలేజీ, యూనివర్శిటీ ఎన్నికల్లో నాయకుడిగా ఎదుగుతూనే ఆయన సేవాప్రస్థానం ప్రారంభమైంది. 1953లో మదనపల్లె బి.టీ కళాశాలలో ఆంధ్ర సారస్వత కళాపరిషత్‌ వేదికపై రాయలసీమకు చెందిన పలువురు కవులను, రచయితలను, పండితులను, కళాకారులను ఘనంగా సత్కరించిన కార్యక్రమంలో సింహభాగాన నిలిచారు.
యువత తల్చుకుంటే అసాధ్యాలు సుసాధ్యం చేయొచ్చని బలంగా నమ్మిన వ్యక్తి. గ్రామీణ అభివృద్ధి కోసం గ్రామగ్రామాలు తిరిగి యువతను చైతన్య మార్గంలో నడిపించారు. యువజన సంఘాలు ఏర్పర్చి గ్రామీణ మౌలిక వసతుల రూపకల్పనకు నిర్విఘ్నంగా కృషిచేశారు. 'ప్రభుత్వ నిధుల గురించి ఎదురుచూడడం శుద్ధ దండగని, యువజనులే గొప్ప నిధులుగా కొండలను పిండి చేయవచ్చ'ని నిరూపించారు. యువజనుల్లో గొప్ప స్ఫూర్తినింపిన రామకృష్ణయ్య కృషిని కొనియాడుతూ 1966లో అంతర్జాతీయ యువజన సామాజిక జాగృతి కార్యక్రమంలో భాగంగా అమెరికాలో భారతదేశ సామాజిక కార్యకర్తలకు ప్రతినిధిగా నాలుగు నెలలపాటు 64 రాష్ట్రాలలో 144 మంది ప్రతినిధులతో సామాజిక విలువలతో కూడిన ప్రసంగాలు, చర్చలు జరిపే అవకాశం వచ్చింది. అమెరికా పర్యటన సందర్భంలో 'భారత హరిత విప్లవం'పై చర్చించేందుకు న్యూయార్క్‌ నగరం నుంచి ప్రపంచ క్రైస్తవ పీఠం ఆయనను ఆహ్వానించింది. ఆయన విషయపరిజ్ఞానాన్ని ఎంతగానో ప్రశంసించిన ఆ సంస్థ సేకరించిన నిధుల నుంచి అత్యంత క్షామపీడిత రాష్ట్రమైన బీహార్‌లో గొట్టపుబావులు తవ్వే యంత్రానికి కానుకగా పంపించారు.

A-tireless-farmer-in-village-reconstruction


      ఎలాంటి ప్రభుత్వ నిధులకు ఆశించకుండా తన సంస్థ ద్వారా గ్రామాల మౌలిక వసతులు మెరుగుపర్చడంలో ఆయన చేసిన కృషికి గాను 2016లో ఢిల్లీ 'ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌' సంస్థ నుంచి 'భారత ఆణిముత్యం' అవార్డు వరించింది. మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేసిన గొప్ప ఆదర్శవాది ఆయన. కుటుంబ నియంత్రణ, మతాశిశు సంరక్షణ, వ్యాధి నిరోధక కార్యక్రమాలు, గ్రామీణ ఆరోగ్యం, పారిశుధ్యం, పోషకాహార రంగాల్లో సమాజానికి అత్యుత్తమ సేవలందించినందుకు 1990లో యునిసెఫ్‌ అంతర్జాతీయ సంస్థ ప్రశంసా పత్రాన్ని అందించింది. యువజన సాధికారత దిశగా సంస్థ చేపట్టిన స్వచ్ఛంద శ్రామిక పనులను, వినూత్న కార్యక్రమాలను అభినందిస్తూ 1986లో జెనీవా యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం అభినందించింది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సంస్థ చేసిన కృషిని బ్యాంకాక్‌ నగర ఏషియన్‌ కల్చరల్‌ ఫోరం ప్రశంసించింది.
    పట్టుపరిశ్రమ అభివృద్ధికి గాను రైతుల్లో అవగాహన కల్పించినందుకు 1994లో ప్రపంచబ్యాంకు నుంచి అభినందనలు అందుకున్నారు. ఐదు దశాబ్దాలుగా విశేష సేవలందించిన గ్రామీణ పునర్నిర్మాణ సంస్థ సేవా కారక్రమాలను ప్రశంసిస్తూ రాష్ట్రప్రభుత్వం కూడా పలు అవార్డులు, ప్రశంసాపత్రాలు అందించింది.
    వృత్తిరీత్యా ప్రభుత్వ పౌరసంబంధాల శాఖలో సోషల్‌ వెల్‌ఫేర్‌ అధికారిగా సమర్థవంత బాధ్యతలు నిర్వర్తిస్తూనే పలు సేవాకార్యక్రమాల్లో భాగమయ్యారు. సాహిత్యరంగంలో కూడా విశేష సేవలందించారు. సమాచార హక్కు చట్టం ఉద్యమకర్తగా, ఫ్రీలాన్సర్‌గా, ఉద్యోగ విరమణ తరువాత అవినీతిపై, బడుగుబలహీన వర్గాల వారికి జరిగే అన్యాయాలపై ధ్వజమెత్తారు. తెలుగు, ఆంగ్ల దినపత్రికలకు వార్తలు, వ్యాసాల రూపంలో పంపించి ఆ సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం చేసేవారు. పలు సామాజిక ప్రగతి కార్యక్రమాల్లో మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణ, మాదక ద్రవ్యాల వినియోగం నియంత్రించడం వంటి వాటిల్లో భాగమయ్యేవారు.
     పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రాకపోయినా, దళారుల చేతిలో మోసపోకుండా రైతులకు అవగాహన కల్పించడంలో సంస్థ తరపున ఎన్నో కార్యక్రమాలు చేశారు. సామాజిక పరంగా ఆయన రాసిన విశ్లేషణలు పలు దినపత్రికల్లో అచ్చయినవి ఆరువేలకు పైగానే ఉంటాయి. విలాసవంత జీవితానికి పూర్తి విరుద్ధంగా నిరాడంబర జీవితం గడిపారు. గొప్ప మానవీయత, జనసంక్షేమానికి ఆదరువుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిన రామకృష్ణయ్య ఇటీవలె మరణించారు. ఆయన మన మధ్య లేకపోయినా అభివృద్ధి పథంలో యువతను మేల్కొల్పడం, గొప్ప సేవాతత్పరత పాటించడం నేటి యువతకు స్ఫూర్తిదాయకం.

దాసరి కృష్ణారెడ్డి,
సీనియర్‌ జర్నలిస్ట్‌,
9392582015