
ఎండవేడిని తాళలేక ప్లాస్టిక్ సంచులనే పాదరక్షలుగా చేసుకుని ముగ్గురుబిడ్డలతో నిస్సహాయంగా నుంచొన్న ఈ మహిళ పేరు రుక్మిణి. భర్త టీబీ వ్యాధితో బాధపడడం ఆ కుటుంబానికి అనుకోని ఉపద్రవం. ఈ పరిస్థితుల్లో.. పనిచేసే కుటుంబ పెద్ద మంచాన పడి, బిడ్డల పోషణ భారమైంది. ఆ పిల్లల కడుపు నింపడం కోసం పారిశుధ్య కార్మిక పని వెతుక్కుంటూ ఆమె మిట్ట మధ్యాహ్నం వేళ బయటికి వచ్చింది. తన వెంటే పిల్లలు కూడా బయలుదేరారు. వేడి తట్టుకోలేక చిన్న బిడ్డ అల్లాడుతుంటే చంకనేసుకుంది. మరి మిగిలిన బిడ్డలిద్దరి పరిస్థితి.. రోడ్డు పక్కన వెతికింది. భోజన వ్యర్థాలతో కొన్ని కవర్లు రోడ్డు పక్కనే పడి ఉన్నాయి. వెంటనే వాటిని తీసుకుని బిడ్డల పాదాలకు రక్షణగా చుట్టింది. తాను కూడా మరో కవరు చుట్టుకుంది. ఇంక భయం లేదు.. ఎంత దూరమైనా వెళ్లొచ్చన్న భరోసాతో వడివడిగా రోడ్డుపై నడుస్తోంది.
మధ్యప్రదేశ్ షియాపూర్ దగ్గర ఇన్‌సాఫ్ ఖురేషి అనే ఫొటోగ్రాఫర్ ఈ కుటుంబాన్ని చూశాడు. తన కెమెరాతో ఈ దృశ్యాన్ని బంధించాడు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు కూడా. షేర్ చేసిన కాసేపటికే ఆ ఫొటో బాగా వైరల్ అయ్యింది. ఇదంతా ఒక ఎత్తయితే.. అంతటి దీనస్థితిలో ఉన్న ఆ మహిళను చూసిన ఖురేషి చలించిపోయాడు. తన జేబులో ఉన్న మొత్తం డబ్బులు తీసి ఆమెకిచ్చి చెప్పులు కొనుక్కోమన్నాడు. కావాల్సిన ప్రచారం జరిగిపోయింది కదా ! తనకెందుకులే అని ఊరికే ఉండకుండా మానవత్వం ప్రదర్శించాడు. ఈ సంఘటనలో మనకు రెండు విషయాలు బోధపడుతున్నాయి.
ఒకటి.. దేశంలో పేదరికంతో కునారిల్లిపోతున్న ప్రజలు, రెండు.. రుక్మిణి హిందు మహిళ. ఖురేషి ముస్లిం వ్యక్తి. దీనస్థితిలో ఉన్న రుక్మిణిని అలా వదిలేయకుండా ఆమె పడుతున్న బాధను కొంతైనా పంచుకోవాలన్న అతని మానవత్వ హృదయం ఇక్కడ కనిపిస్తోంది. అందుకే ఈ దృశ్యం హిందూ, ముస్లిం ఐక్యతకే కాదు దేశంలో వేళ్లూనుకున్న మత సామరస్యానికి చిహ్నంగా చూడాలి. మానవత్వం వెల్లివిరిసే ఇలాంటి ఎన్నో సంఘటనలు దేశంలో ఏదో ఒకమూల రోజూ కనబడుతూనే ఉంటాయి.