
ఇంటర్నెట్‌డెస్క్ : అమెరికాకు చెందిన కెల్సీ కాలు వెనక్కి తిప్పి గిన్నీస్ రికార్డుకెక్కింది. సాధారణంగా కాలు వెనక్కి తిప్పడం అసాధ్యమైన విషయం. ఇలాంటి అసాధ్యమైన పనిని కూడా చాలా సులువుగా చేసేసింది కెల్సీ. అమెరికాలోని న్యూ మెక్సికోలో ఆల్ బకాకీ అనే గ్రామానికి చెందిన కెల్సీ (32) తన కాలిని 171.4 డిగ్రీలు వెనక్కి తిప్పి గిన్నీస్ వరల్డ్ రికార్డులో తన పేరును నమోదు చేసుకుంది. ఆమె గిన్నీస్ రికార్డుకెక్కడానికి బలమైన కారణం ఉందట. చిన్నతనం నుంచే తాను ఏవైనా కొత్తగా చేయాలని తపన పడేదట. గత సంవత్సరమే ఏదో షాప్‌లో గిన్నీస్ రికార్డ్స్ - 2021 పుస్తకం చూసిందట. అందలో ఓ వ్యక్తి తన కాలు వెనక్కి తప్పిన వ్యక్తి ఫొటో ఉంది. ఆ వ్యక్తి ఫొటో చూసిన తర్వాత తనలా ఎందుకు చేయకూడదు అని అనుకుందట.. ఇక అప్పటి నుంచి ఆమె తరచూ కాలు వెనక్కి తిప్పే సాధన మొదలుపెట్టిందట. అలా తరచూ సాధన చేయడం వల్ల.. సులభంగా తన పాదాన్ని వెనక్కి తిప్పగలిగిందట. ఓసారి ఆమె పాదం వెనక్కి తిప్పడాన్ని స్నేహితులు చూసి గిన్నీస్ రికార్డు కోసం ప్రయత్నించమని సలహా ఇచ్చారట. ఇక కెల్సీ కూడా వెంటనే.. గిన్నీస్ రికార్డ్స్ వారికి మెయిల్ పెట్టింది. 'ఇదేదో రికార్డుస్థాయి ఫీట్‌గానే ఉంది. వచ్చి పరీక్షించండి' అని మెయిల్ పెట్టాను. ఇక నేను చేసిన విన్యాసం రికార్డ్స్‌కెక్కిందని తెలిశాక చాలా సంబరపడిపోయాను.' అని కెల్సీ అన్నారు. అయితే ఐస్ స్కేటింగ్ తరచూ సాధన చేయడం వల్ల... తన పాదాన్ని సులువుగా వెనక్కి తిప్పగలిగానని కెల్సీ చెప్పారు. సాధారణంగా చాలామంది 90 డిగ్రీల వరకూ పాదాన్ని వెనక్కి తిప్పగలిగితే.. కెల్సీ మాత్రం దాదాపు 180 డిగ్రీలు వెనక్కి తిప్పింది. దీంతో ఈ వార్త వైరల్‌గా మారింది.