Sep 17,2023 12:49

అమరావతి : జిమ్‌ లో ట్రెడ్‌మిల్‌ పై పరుగెడుతున్న 19 ఏళ్ల యువకుడు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో శనివారం వెలుగు చూసింది. ఘాజియాబాద్‌లోని జిమ్‌లో సిద్ధార్థ్‌ కుమార్‌ సింగ్‌ (19) ట్రెడ్‌మిల్‌ పై కసరత్తు చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. స్పృహకోల్పోయిన యువకుడిని గమనించిన అక్కడి సిబ్బంది వెంటనే అతడిని తట్టి లేపేందుకు ప్రయత్నించారు. కానీ యువకుడిలో ఎలాంటి కదలికలు రాలేదు. ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండాపోయింది. కసరత్తు చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించాడు. ఇందుకు సంబంధించిన షాకింగ్‌ దఅశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సిద్ధార్థ్‌ సింగ్‌ నోయిడాలోని ఓ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నోయిడాలోనే తన తండ్రి వద్ద ఉంటున్నాడు. అతడి తల్లి బీహార్‌లో ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆ దంపతులకు సిద్ధార్థ్‌ ఒక్కడే సంతానం కావడంతో వారు శోకసంద్రంలో మునిగారు. అంతకు కొద్ది నిమిషాల ముందే సిద్ధార్థ్‌ తనతో ఫోన్లో మాట్లాడాడంటూ అతడి తల్లి కన్నీరుమున్నీరైంది. యువకుడి మఅతదేహాన్ని అతడి తండ్రి తమ స్వస్థలానికి తీసుకెళ్లారు.

;