Jun 26,2022 17:03

న్యూఢిల్లీ :  దేశవ్యాప్తంగా మూడు లోక్‌సభ స్థానాలకు, ఏడు అసెంబ్లీ స్థానాల కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. పంజాబ్‌ సంగ్రూర్‌ లోక్‌సభ స్థానంలో ఆప్‌ ఓటమిపాలైంది. ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌కు కంచుకోట అయిన ఈ నియోజకవర్గంలో శిరోమణి అకాలీదళ్‌ (అమృత్‌సర్‌) అభ్యర్థి సిమ్రంజిత్‌ సింగ్‌ మాన్‌ ఐదు వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. సంగ్రూర్‌ నియోజకవర్గంలో 15.69 లక్షల ఓటర్లు ఉండగా ఓటింగ్‌ శాతం తగ్గుతూ వస్తోంది. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో 45.30 ఓటింగ్‌ శాతం మాత్రమే నమోదైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 72.44 శాతం ఉండగా, 2014లో 76.71 శాతంగా ఉంది. ఢిల్లీలోని రాజీందర్‌ నగర్‌ ఉప ఎన్నకల్లో 11వేల ఓట్ల తేడాతో ఆప్‌ అభ్యర్థి దుర్గేశ్‌ పథక్‌ విజయం సాధించారు. ఇటీవల రాఘవ్‌ చద్దా రాజ్యసభకు ఎన్నికకావడంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. యుపిలో రెండు స్థానాలకు గాను రామ్‌పూర్‌ స్థానంలో బిజెపి అభ్యర్థి ఘనశ్యామ్‌ లోధి 40వేల ఓట్ల మార్జిన్‌తో గెలుపొందారు. అజమ్‌ఘర్‌లో బిజెపి అభ్యర్థి దినేష్‌ లాల్‌ యాదవ్‌ సమాజ్‌ వాది పార్టీ అభ్యర్థిపై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. త్రిపురలోని మూడు అసెంబ్లీ స్థానాలను బిజెపి గెలుచుకోగా, ఒకస్థానాన్ని కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది.