Sep 20,2022 08:08

చండీగఢ్‌ : పంజాబ్‌ అసెంబ్లీలో ఆప్‌ ప్రభుత్వం ఈ నెల 22న విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌ సోమవారం తెలిపారు. కొన్ని రోజుల నుంచి ఆప్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో విశ్వాస పరీక్ష నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి ట్వీట్‌ చేశారు. ఈ ఏడాది పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రజలను డబ్బుతో కొనడానికి ప్రయత్నించినా ప్రజలు తమవైపే ఉన్నారని పేర్కొన్నారు. 'ప్రపంచంలో ఏ కరెన్సీలో కూడా ప్రజల విశ్వాసానికి విలువ కట్టలేం. ఈ నెల 22న పంజాబ్‌ విధాన సభ ప్రత్యేక సమావేశంలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతాం. విప్లవం చిరకాలం వర్థిల్లాలి' అని ట్వీట్‌ చేశారు. గతవారంలో కనీసం 10 మంది ఆప్‌ ఎమ్మెల్యేలను కొనడానికి బిజెపి ఫోన్‌ ద్వారా ప్రయత్నించిందని ఆర్థిక మంత్రి హర్పల్‌ సింగ్‌ చీమా తోలినాకె, దీనిపై విచారణ జరపాలని అన్ని ఆధారాలతో పంజాబ్‌ డిజిపి గౌరవ్‌ యాదవ్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఈ నెల 14న దీనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, విజిలెన్స్‌ బ్యూరోకు కేసు బదిలీ చేశారు.