May 29,2023 20:53
  •  ఒకరు ఆత్మహత్యాయత్నం

ప్రజాశక్తి - మంగళగిరి (గుంటూరు) : బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ (ఎపిఎస్‌ఎస్‌డిసి) కార్యాలయం వద్ద రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ట్రైనర్స్‌ సోమవారం నిరసన తెలిపారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో శ్రీకాకుళానికి చెందిన ఇంగ్లీష్‌ ట్రైనర్‌ రంజిత్‌ చీమల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్పందించిన సిబ్బంది ఆయనను మంగళగిరి ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు, ఇతర ట్రైనర్స్‌ మాట్లాడుతూ.. స్కిల్‌డెవలప్‌మెంట్‌ కింద విద్యార్థులకు శిక్షణను ఇచ్చేందుకు 2018లో గత ప్రభుత్వం తమను నియమించిందని..2021 ఏప్రిల్‌ వరకూ తాము పనిచేశామని, ఆ తర్వాత 854 మంది ట్రైనర్స్‌ను విధుల నుంచి తొలగించారని తెలిపారు. తమను విధుల్లోకి తీసుకోవాలని, ఆరునెలల బకాయి వేతనాలు చెల్లించాలని రెండేళ్లుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని వాపోయారు. తమకు న్యాయం చేస్తామని పాదయాత్రలో జగన్‌ హామీ ఇచ్చి విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల వేతనం రూ. 40వేలు అని చెప్పి రూ.20 వేలు మాత్రమే ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై ఎటువంటి కేసూ నమోదు కాలేదని తాడేపల్లి పోలీసులు చెప్పారు.