May 28,2023 08:08

'నీ నిర్ణయం మారదా?' బలహీనమైన స్వరంతో అడిగాడు భానుమూర్తి.
'అవును' అంది స్ధిరంగా ఇరవై నాలుగు సంవత్సరాల శ్యామల.
శ్యామల భానుమూర్తి కూతురు.
'చక్కని సంబంధాల్ని కాదని ఎవడితోనో క్లాసుమేటు అంటూ పోతానంటోంది. ఏం బుద్ధి పుట్టిందో. ఆడ పిల్లయినా మగాడిలా పెంచినందుకు మనకీ క్షోభ' కళ్ళల్లో నీరు నిండుతుండగా అంది శ్యామల తల్లి రుక్మిణి.
'మా ప్రేమకి కులమత భేదాలు లేవు!'
'అమర ప్రేమ, లైలా మజ్నూలు మరి' వెటకారంగా అన్నాడు భానుమూర్తి.
శ్యామల సూట్‌ కేస్‌ పట్టుకుని బయటికి నడిచింది. ఆమె వెనుకే తలుపు మూసుకుంది. రుక్మిణి వెక్కిళ్ళు వినిపిస్తున్నాయి. శ్యామల కాబ్‌ పిలిచి, రిజిష్టర్‌ ఆఫీసుకు తీసుకు వెళ్ళమంది. అక్కడ ఆమె ప్రియుడు అనీల్‌ ఎదురు చూస్తున్నాడు.

అగ్ని సాక్షిగా కాకుండా రిజిష్టర్‌ సాక్షిగా వధూవరులయ్యారు. శ్యామల మదిలో ఎక్కడో చిన్న అపరాధ భావన కలిగింది. కానీ ప్రేమ పెళ్ళి కదా చిన్న చిన్న ఇబ్బందులు దాటి, నా ప్రేమను పండించుకోవాలి అని మళ్లీ సర్ది చెప్పుకుంది.
పెళ్ళయ్యాక హనీమూన్‌కి మనాలి వెళ్ళారు. 'నీలాంటి అమ్మాయి దొరకడం నా అదృష్టం. నీలా అందమైన, తెలివైన అమ్మాయి దొరకడం కష్టం' శ్యామలని పొగిడాడు.
ఆరునెలలు ఆరు రోజుల్లా గడిచిపోయాయి. మోహకేంద్రాల విస్ఫోటనాల్ని ఆత్మల ఐక్యంగా భావిస్తున్నారు.

శ్యామల, అనీల్‌ ఇద్దరూ హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. వాళ్ళు కాపురం పెట్టిన ఆరు నెలలకి కరోనా వచ్చింది. అనీల్‌ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నాడు.
'అనూ, ఈ రోజు వంట చెయ్యలేను. ఏదైనా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చెయ్యి'
'ష్యూర్‌ బిర్యాని..?' అన్నాడు అనీల్‌.
'లవ్లీ. బిర్యాని తిని చాలా రోజులైంది' అంటూ అనీల్‌ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది.
అరగంట తర్వాత పార్సిల్‌ వచ్చింది. పార్శిల్‌ విప్పాడు అనీల్‌.
ఇద్దరూ బిర్యానీ తినేసి, పడుకున్నారు.

రాత్రి పది గంటలు.. శ్యామల మీద చెయ్యి వేసాడు అనీల్‌. శ్యామల కళ్ళు ఏడ్చి ఎర్రగా ఉన్నాయి.
'ఎందుకు ఏడుస్తున్నావు?'
'మనమిద్దరం చివరి వరకూ కలిసి ఉంటామా?' అని
'ఎందుకు ఉండలేం? అయినా నీకెందుకు ఇప్పుడా సందేహం వచ్చింది?' అంటూ పెద్దగా నవ్వాడు అనీల్‌.
అయోమయంగా చూసింది శ్యామల.
'రొమాంటిక్‌ మూడ్‌లో ఉన్నా రా!' అని దగ్గరికి లాక్కోబోయాడు.
'నాకు లేదు' అని దిండు తీసుకొని, వేరే గదిలోకి వెళ్ళిపోయింది.

అనీల్‌ గురించి ఆలోచనలతో ఆందోళనపడుతోంది. గతంలోలా తన మీద శ్రద్ధ చూపించడం లేదని గ్రహించింది.
శ్యామలకి రుక్మిణి నుండి ఫోన్‌ వచ్చింది.
'నాన్నగారికి హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. నువ్వు చూడడానికి రానవసరం లేదు.'
'అందేటమ్మా?'
'నిన్ను చూస్తే అది మళ్ళీ పెరుగుతుంది. నా తిప్పలేవో నేను పడతానులే!'
'డబ్బులు పంపనా అమ్మా?' కన్నీళ్ళతో అడిగింది శ్యామల.
'నీ డబ్బుతో ఆయన జబ్బు నయం కాదులే. నువ్వు బాగానే ఉన్నావుగా?' అంటూ ఫోన్‌ కట్‌ చేసింది.
'అమ్మా పరాయిదాన్ని అయిపోయానా?' అంటూ విలపించింది శ్యామల.

అనీల్‌ బాత్‌రూమ్‌లో ఉండగా అనీల్‌ ఫోన్‌ మోగింది. స్టెల్లా అనే పేరు. ఇరవై ఏళ్ళ అమ్మాయి ఫొటో స్క్రీన్‌ మీద కనపడ్డాయి. అది చూసి ఉలిక్కిపడింది శ్యామల. ఈ కాల్‌ చూసినప్పటి నుంచే శ్యామల స్థిమితంగా లేదు.
ఇద్దరి కామన్‌ ఫ్రెండ్స్‌లో స్టెల్లా లేదు. ఎవరీ స్టెల్లా? నేను కాకుండా అనీల్‌ వేరేవాళ్ళతో...
'ఛ..ఛ నా అనీల్‌ అలాంటివాడు కాదు!' అని తనకు తను సర్ది చెప్పుకుంది.
రాత్రి పది గంటలకి మళ్ళీ స్టెల్లా నుండి ఫోన్‌ వచ్చింది.
'స్టెల్లా ఎవరు?'
'నా ఫోన్‌ చెక్‌ చేస్తున్నావా?'
'ఎవరు అని అడుగుతున్నా?'
'ఇంటర్‌లో నా క్లాస్మేట్‌. యు.ఎస్‌ నుండి వచ్చిందిట. మళ్ళీ రెండు నెలల్లో జర్మనీ వెడుతుందిట.'
'వాళ్ళ నాన్నకి అక్కడ నాలుగు కంపెనీలు. రెండు చర్చ్‌లున్నాయి. నన్ను కూడా రమ్మంటోంది!'
'నీకు పెళ్ళయిందని చెప్పలేదా?'
'చెప్పాను.'
'అదేం పెద్ద ఇష్యూ కాదంది. డివోర్స్‌ తీసుకోవచ్చు అంది.'
శ్యామలలో ఆవేశం ఎగదన్నింది.
'నీకు ప్రేమంటే తేలిక. ఆడదంటే ఆట వస్తువు. అదెవర్తో పౌండ్లు ఎర చూపితే తోక ఊపుకుంటూ పోతున్నావు. మీ మగాళ్ళ బుద్ధే అంత.. అన్నీ వదులుకుని వస్తే ఇప్పుడు ఇలా అంటావా? అంతా నా కర్మ !' అంటూ చేతులతో తల బాదుకుంటూ హిస్టీరిక్‌గా మారింది. చేతికి అందిన వస్తువులన్నీ అనీల్‌ మీద పడేస్తోంది. అలాగే ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది.

ఆరు నెలల తర్వాత శ్యామల, అనీల్‌ విడాకులు తీసుకున్నారు.
శ్యామల తండ్రిని క్షమించమని అడగడానికి వెళ్ళింది. తండ్రి శవం మీద రుక్మిణీ పడి ఏడవడం కనిపించింది.
'పాపిష్టి దానా ! నీ మూలంగా ఆయన పోయారు!'
శ్యామల మూర్ఛపోయింది !
ఏడాది తర్వాత..

రాగిణి సైకియాట్రిక్‌ సర్వీసెస్‌.
'శ్యామలకి మందులు వల్ల ఇంప్రూవ్‌మెంట్‌ కనబడటం లేదు. మధ్యలో షాక్‌ ట్రీట్మెంట్‌ ఇచ్చాం. చూద్దాం. కొన్నాళ్ళకి పరిస్థితి మారుతుందేమో. ఇంతకీ మీరు శ్యామలకి ఏమవుతారు?'
'శ్యామల బావని. ఎప్పటికైనా ''బావా'' అని పిలుస్తుందని ఎదురుచూస్తున్న వాడిని.'
శ్యామల బావ మహీధర్‌ శ్యామల కేసి చూశాడు. చెదిరిన జుట్టుతో అంటోంది 'అనీల్‌ బూచి ఎత్తుకుపోతాడు. హీ హీ!' అంటూ చప్పట్లు కొడుతోంది.
మహీధర్‌ కంట్లో ప్రేమాశ్రువులు నిండాయి

ఏడాది తర్వాత రాగిణి సైకియాట్రిక్‌ సర్వీసెస్‌లో
'మహీ గారు, శ్యామల పూర్తిగా గతం మర్చిపోయింది. మీరు ఆవిడకి బావలా కాకుండా నా చుట్టంలా పరిచయం చేస్తాను' అని డాక్టర్‌ చెప్పారు.
'మీరు కూడా పొరపాటున గతం ప్రస్తావన తీసుకురావొద్దు.'
'అలాగే డాక్టర్‌' అన్నాడు మహీధర్‌ భారంగా.
శ్యామల ముఖం గ్రహణం వీడిన చంద్రుడిలా ఉంది.
దూరంగా ఎవరి మొబైల్‌ నుండో పాట వస్తోంది 'చలో ఏక్‌ బార్‌ ఫిర్‌ సే అజ్‌ నబి బన్‌ జాయే
హమ్‌ దోనో'

వీరేశ్వరరావు మూల
9494746228