Aug 19,2022 20:50
  • ఇద్దరు కార్మికులు దుర్మరణం-తొమ్మిది మందికి గాయాలు
  • వారిలో ఒకరి పరిస్థితి విషమం

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, కాకినాడ రూరల్‌ : కాకినాడ రూరల్‌ మండలం వాకలపూడి పారిశ్రామిక ప్రాంతంలోని ప్యారీ సుగర్స్‌ రిపైనరీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తోటి కార్మికులు, పోలీసుల కథనం ప్రకారం... ప్యారీ షుగర్‌ ఫ్యాక్టరీ లోడింగ్‌ యూనిట్‌ వద్ద శుక్రవారం 11 మంది కార్మికులు పనిచేస్తున్నారు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా కన్వేయర్‌ బెల్టులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఈ బెల్టు వద్ద పని చేస్తున్న యు.కొత్తపల్లి మండలం కొండేవరానికి చెందిన రాయుడు వీరవెంకటసత్యనారాయణ (36), సామర్లకోట మండం వేట్లపాలేనికి చెందిన వీరమళ్ల రాజేశ్వరరావు (45) అక్కడికక్కడే మృతి చెందారు. కన్వేయర్‌ బెల్టులో వీరవెంకటసత్యనారాయణ ఇరుక్కుపోవడంతో ఆయన శరీరం మూడు భాగాలుగా విడిపోయింది. పిఠాపురం మండలం కందరాడకు చెందిన బండి వీర వెంకట రమణ, కరప మండలం కూరాడకు చెందిన జాగు వీరబాబు, పెద్దాపురం మండలం గుడివాడకు చెందిన జి.సూర్య సుబ్రహ్మణ్యం, యు.కొత్తపల్లి మండలం కొమరగిరికి చెందిన మొరుకుర్తి జగన్నాథం తీవ్ర గాయాలతో కాకినాడలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో వీర వెంకట రమణ ఆందోళనకరంగా ఉంది. మరో ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు. సంఘటనా స్థలాన్ని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎస్‌పి ఎం.రవీంద్రనాథ్‌బాబు పరిశీలించారు. ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. లోడింగ్‌ గొడౌన్‌లో త్రీ ఫేస్‌ ఎంసిబి షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల కన్వేయర్‌ బెల్ట్‌లో పేలుడు సంభవించడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

  • మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని ధర్నా

విశాఖ గ్యాస్‌ లీకేజ్‌ ఘటనలో మృతుల కుటుంబాలకు ఇచ్చిన మాదిరిగా ఇక్కడ మరణించిన కార్మికుల కుటుంబాలకు కూడా రూ.కోటి చొప్పన, గాయాల పాలైన వారికి రూ.50 లక్షలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ ప్యారీ షుగర్స్‌ ముందు తోటి కార్మికులు, సిఐటియు ఆధ్వర్యాన ధర్నా జరిగింది. భద్రత చర్యలు విస్మరించిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, మృతుల, గాయపడిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.రాజ్‌కుమార్‌, సీనియర్‌ నాయకులు దువ్వా శేషబాబ్జి, మేడిశెట్టి వెంకటరమణ, మలకా వీర వెంకటరమణ తదితరులు పాల్గన్నారు. పలు ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు.

 

kkd