May 30,2023 16:19

ప్రజాశక్తి-తిరుమల : తిరుమల ఘాట్‌ రోడ్‌లో ప్రమాదాల నివారణ చర్యలు ప్రారంభించినట్లు ఏఎస్పీ ముని రామయ్య తెలిపారు. తిరుమల ఘాట్‌ రోడ్‌లో జరిగే ప్రమాదాలపై తీసుకున్న చర్యలను ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో వివరిచారు. ఈ సందర్భంగా ఏఎస్పీ ముని రామయ్య మాట్లాడుతూ.. ఘాట్‌ రోడ్‌ రోడ్డు డ్రైవింగ్‌పై వాహనదారులకు అవగాహన లేకపోవడంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సెల్ఫోన్‌ డ్రైవింగ్‌, వాహనాలు అతివేగం వల్ల ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. సెల్ఫీలు తీసుకోవడం కోసం రోడ్డు పక్కన వాహనాలు ఆపడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఘాట్‌ రోడ్డు అవగాహన కలిగిన డ్రైవర్లు మాత్రమే వాహనాలు నడపాలన్నారు. డ్రైవర్లకు అవగాహన కల్పించే విధంగా తిరుమల ట్రాఫిక్‌ పోలీసులు పలు ప్రాంతాలలో సూచనలు... సలహాలు ఇచ్చే విదంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఘాట్‌ రోడ్డులో స్పీడ్‌ లిమిట్‌ను తిరిగి ప్రారంభిస్తామన్నారు. పై వాటిలో వేటినైనా అతిక్రమిస్తే ఆ వాహనాలను పూర్తిగా తిరుమలకు నిషేధించే విధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ట్రాఫిక్‌ డిఎస్పి కొండయ్య, ఎంవిఐ కుసుమ, ఏవీఎస్‌ఓలు గిరిధర్‌, శివయ్య తదితరులు పాల్గొన్నారు.